Ap Government: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
Ap Government: రాజధాని కేసుల విచారణ ముందుగా విచారించాలని ఏపీ ప్రభుత్వం కోరిన క్రమంలో అలా చేయడం సాధ్యం కాదని, 28వ తేదీనే విచారిస్తామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అమరావతి రాజధాని కేసు పెద్దది, సమయం తీసుకొని విచారించాలని న్యాయస్థానం పేర్కొన్న క్రమంలో 28తో పాటుగా తరువాతి రెండు రోజులు కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే ఈ కేసులో రాజ్యాంగ పరమైన అంశాలు ఉన్నాయి, ఇంతకు మించి ఏమీ వ్యాఖ్యానించలేమని ధర్మాసనం పేర్కొంది. ఇక తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం అలా చేసేందుకు నిరాకరించింది. అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా అందుకు స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 3 రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరడంతో కోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది.