Dayasagar Letter: జగన్ తో మా అనుబంధాన్ని శంకించవద్దంటున్న సుచరిత భర్త!
Sucharitha Husband Dayasagar Letter on Paryt Change: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మేకతోటి సుచరిత టీడీపీలోకి వెళ్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా పని చేసి రిటైర్ అయిన ఆమె భర్త దయాసాగర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని, ఈ నేపథ్యంలో తన భర్త ఏ పార్టీలో ఉండే తాను అక్కడే ఉండాలిగా అంటూ సుచరిత చేసిన వ్యాఖ్యలతో ఆమె టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం మరింత ముదిరింది. ఈ క్రమంలో పార్టీ మారతారు అన్న ప్రచారంపై మాజీ మంత్రి సుచరిత భర్త దయ సాగర్ బహిరంగ లేఖ రాశారు. నేను కేంద్ర సర్వీసులో ఉన్నతాధికారిగా పని చేశానని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అత్యంత అనుబంధం కలిగిన కుటుంబం మాదని అన్నారు. మాకు జగన్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని శంకించవద్దని పేర్కొన్న ఆయన నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను ,ఇక్కడి నుంచి పోటీ చేస్తాను అని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయని అన్నారు. ఇక రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన నేను రాజకీయాలకు వస్తే అందరికీ చెప్పే వస్తానని అన్నారు. మా కుటుంబంలో పార్టీ మారతారు అనే ప్రశ్న ఉత్పన్నం అవడానికి ఆస్కారం లేదని పేర్కొన్న ఆయన నిరాధారమైన ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం మా కుటుంబానికి లేదని అన్నారు. అలాగే మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని అయన పేర్కొన్నారు.