Sri Atmasakshi Survey on AP Polls: భయపెడుతున్న సర్వే ఫలితాలు… ఆందోళనలో నేతలు
Sri Atmasakshi Survey on AP Polls: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా విజయఢంకా మోగించింది. అయితే, ఈ ఎన్నికలకు ముందు అన్ని సర్వే సంస్థలు ముందస్తు సర్వేలను ప్రకటించాయి. చాలా సంస్థలు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, ఓ సంస్థ మాత్రం దానికి విరుద్దంగా ఫలితాలు ఇచ్చింది. వైసీపి 140 కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీకి 20 నుండి 28 స్థానాలు, జనసేన రెండు చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆ అంచనాలు నిజమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైపీపీకి 22 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఆ అంచనాలు నూటికి నూరుపాళ్లు నిజమయ్యాయి. దీంతో ఈ సంస్థ చేపట్టే సర్వేపై అందరి అంచనాలు ఉన్నాయి. ఈ సంస్థ 2022 నవంబర్ 20 నుండి 2023 ఫిబ్రవరి 17వ తేదీ వరకు సర్వేను నిర్వహించింది. అందరిలా ఫోన్ ద్వారా సర్వేను కాకుండా, నేరుగా ప్రతి నియోజకవర్గంలోకి ఏజెంట్లను పంపించి క్షేత్రస్థాయిలో సర్వేను నిర్వహించారు. 175 నియోజక వర్గంలో సర్వేను నిర్వహించినట్లు శ్రీ ఆత్మసాక్షి సంస్థ తెలియజేసింది. ప్రతి నియోజకవర్గంలో 300 శాంపిల్స్ చొప్పున సేకరించింది.
మొత్తం 175 నియోజకవర్గాల్లో 60,200 శాంపిల్స్‌ను సేకరించినట్లు తెలియజేసింది. కొత్తగా ఓటు హక్కు వచ్చినవారి దగ్గరి నుండి 60 ఏళ్లు నిండినివారి వరకు, మహిళలు, రైతలనుండి కూడా వివరాలు సేకరించింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు ఏపీలో టెన్షన్ పెడుతున్నాయి. ఏపీలో మరో 30 ఏళ్ల వరకు తమ పార్టీనే పరిపాలిస్తుందని ధీమాను వ్యక్తం చేసిన పార్టి అంచనాలు తలక్రిందులయ్యే అవకాశాలు ఉంటాయని ఆ సంస్థ సర్వేలో తేలింది. ఏపీలో అధికారంలోకి రావాలంటే 88 మంది సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి 63, టీడీపీకి 78 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.
ఇక జనసేన పార్టీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇందులో రెండు సీట్లు ఉభయగోదావరి జిల్లాలో గెలుచుకుంటుందని సర్వే తెలియజేసింది. పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని, చిత్తూరులో వైసీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది.
ఓట్ షేరింగ్ విషయంలోనూ టీడీపీ మెజారిటీ సాధిస్తుందని శ్రీ ఆత్మసాక్షి అంచనా వేసింది. టీడీపీకి 42.50 శాతం ఓట్ షేరింగ్ లభిస్తే, వైసీపీకి 41.50 శాతం, జనసేన పార్టీకి 11 శాతం మేర ఓటు షేరింగ్ లభించే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి తెలియజేసింది. అయితే, 2.5 శాతం మంది ఎవరికి ఓటు వేస్తామన్నది చెప్పలేకపోయారని, వీరు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలియజేసింది. మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఈ ఫలితాలు వెలువడతాయని అంచనా వేసింది. అయితే, గత కొంతకాలంగా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కలిసి పోటీ చేస్తే ఆ రెండు పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయన్నది మరో సర్వే ద్వారా తెలియజేయనున్నట్లు శ్రీ ఆత్మసాక్షి సంస్థ తెలియజేసింది. గతంలో మాదిరిగా ఈ సర్వే ఫలితాలు నిజమౌతాయా… ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండటంతో ఏమైనా జరగొచ్చని నేతలు చెబుతున్నారు.