AP New CS : ఏపీ నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి
AP Govt Appointed KS Jawahar Reddy as New Chief Secretary: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ శమీర్ శర్మ రేపు (బుధవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తరువాతి స్థానంలో సీనియార్టీ ప్రకారం నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్ ,పూనం మాలకొండయ్య, కరకలవలవెన్, శ్రీలక్ష్మి ఉన్నారు. ఈ జాబితాలో గిరధర్ కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. పూనం మాలకొండయ్యకు తాజా బదిలీల్లో సీఎంఓలో అవకాశం ఇచ్చారు. 1990బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి పైన తొలి నుంచి సీఎంకు గురి ఏర్పడింది. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు. ఆ తరువాత టీటీడీ ఈవోగా పని చేసారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి జగన్ తన కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా హోదాలో అవకాశం ఇచ్చారు.
సమర్ధుడైన అధికారిగా పేరున్న జవహర్ రెడ్డి 2024 జూలై నెలాఖరు వరకు పదవిలో కొనసాగనున్నారు. కీకలమైన ఎన్నిక సమయంలో జవహర్ రెడ్డిని సీఎం జగన్ ఎంపిక చేసుకున్నారు. ఇక, ఇదే సమయంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మధుసూదన రెడ్డికి బాధ్యలు అప్పగించారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ కి కొత్తగా కేటాయించారు. ఇప్పటి వరకు ఆ పోస్టులో ఉన్న బుడిజి రాజశేఖర్ సెలవు పైన వెళ్లారు. ఆయనను సెలవు నుంచి తిరిగి వచ్చిన తరువాత జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండేను నియమించారు. ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారిన హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్ దివాన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.