మహిళా పొదుపు సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)శుభవార్త చెప్పింది. ఏపీలో(AP) పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు(Interest rates) తగ్గించేందుకు ఎస్‌బీఐ (SBI)ముందుకొచ్చింది.
SBI : మహిళా పొదుపు సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)శుభవార్త చెప్పింది. ఏపీలో(AP) పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు(Interest rates) తగ్గించేందుకు ఎస్‌బీఐ (SBI)ముందుకొచ్చింది. పొదుపు రుణాలపై రెండున్నర శాతం మేర వడ్డీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. సీఎం జగన్ (CM Jagan)విజ్ఞప్తి మేరకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రుణాలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఈ వడ్డీ తగ్గింపు రూ.5 లక్షల పైచిలుకు రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుంది.
సాధారణంగా మహిళా సంఘాలకు ఆయా బ్యాంకులు రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ రూ.3 లక్షలకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కేవలం ఏడు శాతం వడ్డీ తీసుకుంటారు. అయితే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య రుణాలపై ఆయా బ్యాంకులు నిర్దేశించుకునే నిర్ణీత ఎంసీఎల్‌ఆర్ ప్రకారం వడ్డీ వసూలు చేస్తారు. వడ్డీ రేట్ ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటుంది. ఇక రూ.5 లక్షలకు పైబడి పొదుపు రుణాలపై బ్యాంకులు తమ విచక్షణ మేరకు వడ్డీ రేటు వసూలు చేస్తుంటాయి.
పొదుపు సంఘాలు రూ.5 లక్షలకు పైబడి రుణాలు తీసుకుంటే.. దానికి కొన్ని బ్యాంకులు 13 శాతం వడ్డీ వసూలు చేయగా.. మరికొన్ని బ్యాంకులు కాస్త తక్కువగా వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎస్బీఐ మాత్రం రూ.5 లక్షలు పైబడిన పొదుపు రుణాలపై 12.15 శాతం వడ్డీ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు దీన్ని 2.25 శాతం తగ్గించి 9.90 శాతం చేసినట్లు బ్యాంకు తెలిపింది. రూ.10 నుంచి రూ.20 లక్షలలోపు రుణాలపై వడ్డీరేటును 9.7 శాతానికి తగ్గించింది.
ఏపీలో గత మార్చిలో సీఎం జగన్ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు తీసుకునే పొదుపు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని సీఎం జగన్ బ్యాంకర్లను కోరారు. పొదుపురు రుణాలపై అదనపు ఛార్జీలు వసూలు చెయ్యొద్దని కోరారు. దీంతో ఎస్‌బీఐ అప్పట్లోనే తాత్కాలికంగా నాలుగు నెలల కాలానికి, అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జులై 31 వరకు తీసుకునే రూ.5 లక్షల పైబడిన పొదుపు రుణాలపై దాదాపు రెండు శాతం తగ్గించడానికి ముందుకొచ్చింది.
ఆ గడువు ముగియడంతో సెర్ప్ అధికారులు మళ్లీ రెండేళ్లపాటు వడ్డీ తగ్గించాలంటూ ఎస్‌బీఐకి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంకు ప్రాంతీయ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్పందిస్తూ.. 2024 మార్చి నెలాఖరు వరకు రూ.ఐదు లక్షలకు పైబడిన పొదుపు రుణాలపై 2.15 శాతం నుంచి 2.45 శాతం తక్కువ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు ఎస్బీఐ ఆమోదం తెలిపింది. రూ.20 లక్షల వరకు ఎలాంటి ప్రొసెసింగ్ ఛార్జీలు, ఇన్‌స్పెక్షన్ చార్జీలు, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ ఛార్జీలు ఉండవని తెలిపింది.