Cock Fight: గెలిచిన కో ‘డి’..ఓడిన ఖాకి
Cock Fight: సంక్రాంతి వచ్చిందటే చాలు ఆ సందడే వేరు..ఎవరెక్కడున్న ఈ పండక్కి ఊరిబాట పట్టాలిసిందే. సంక్రాంతి అంటే అందరికి గుర్తుకొచ్చేది భోగి మంటలు, ఇంటిముందు రంగు రంగుల ముగ్గులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు,గంగిరెద్దు మేళంలు, జానపద కళారూపాలు, సంక్రాంతికి సొబగులుఇవి మాత్రమే కాదు పందానికి కాలుదువ్వే కోడిపందాలు కూడా గుర్తుకొస్తాయి.
ముగ్గులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇక కొన్నేళ్లుగా జరుగుతున్న కోడిపందాలు ఆపాలని ఎవరు ఎన్నిప్రయత్నాలు చేసిన కోడిపందాలు ఆపలేకపోయారు. ఇవిలేకుంటే మజా ఏముంటుంది మరి. కోడి పందాలను ఏనాడో ప్రభుత్వం నిషేధించింది. దీనికి హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. తీర్పు తో సంబంధం లేకుండా పందాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి లాగానే పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలను నివారిస్తామని పోలీసులు చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. పోలీసులు గత పది రోజుల నుండి కోడి పందాల నివారణపై చర్యలు తీసుకుంటున్నాకూడా యదేచ్చగా ఈ పందాలు జరుగుతున్నాయి.
ప్రజాప్రతినిధులు,పోలీసులు ఉండగానే బరితెగించిన పందెం రాయుళ్ళు కాయ్ రాజా కాయ్ అంటూ పందాలను కోరుగా సాగిస్తున్నారు. రెవెన్యూశాఖ అధికారులు ఈ ఏడాది కోడిపందాలు ,జూదాలు ఉండవని మైకులు పట్టుకుని గొప్పలు చెప్పుకున్నారు. కానీ అవన్నీ పెడచెవినపెట్టిన పందెం రాయుళ్లు జోరుగా పందాలకు సై అంటున్నారు. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు గుండాటల్లో కూడా లక్షలు చేతులు మారాయి. మండలంలో లోసరి, చినఅమిరం, రాయలం, ఈలంపూడి, తాడేరు, తుందుర్రు ప్రాంతాల్లో బరులు నిర్వహించారు. కాళ్ళ మండలం సీసలి గ్రామం బరిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు కోడిపందేలను ప్రారంభించారు. మార్టేరు పందెం బరిలో 21 పందేల్లో అధిక శాతం పందెం గెలు పొందిన వారికి బుల్లెట్‌వాహనం బహుమతిగా ఇస్తామంటూ ప్రచారం చేశారు. పూలపల్లిలోని ఓ బరివద్ద అధిక పోటీల్లో విజయం సాధించిన కోడి యజమానికి బుల్లెట్ ను ప్రదర్శనగా ఉంచారు. ఈవిధంగా ఇద్దరికి రెండు బులెట్‌లు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పాలకోడేరు మండలంలో గుండాట, పేకాట జోరుగా సాగాయి. ఉదయం నుంచే కోడిపందేలు, జూదాలు యథేచ్ఛగా సాగాయి. నరసాపురం మండలంలో బరుల్లో కోడిపుంజులు కత్తులు దూశాయి. పట్టణ, మండలంలో పరిధిలో మొత్తం 20కుపైగా బరులు వెలిశాయి. వీవర్స్‌కాలనీ బరిలో చైర్‌పర్సన్ వెంకటరమణ, వైస్ చైర్మన్ కామన నాగినిలు కోడి పుంజులను బరిలోకి వదిలి పందాలను ప్రారంభించారు. వీరికి గస్తికాసిన పోలీసులముందే ఈ పందాలు జరగడంతో పోలీసులు దగ్గరుండి మరి పందాలు కాయిస్తున్నారా అనే అనుమానం రాకపోదు.