Sajjala: ఇది ప్రభుత్వ వ్యతిరేకత కానే కాదు.. అందుకే టీడీపీ గెలుపు: సజ్జల!
Sajjala Ramakrishna Reddy: ఏపీలో వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని సజ్జల అన్నారు. పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టిడిపి వైపు మళ్ళాయని, ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలని కామెంట్ చేశారు. ఇక ఏం రకంగాను ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవని పేర్కొన్న సజ్జల టిడిపి సంబరాలు చేసుకోవటం తోనే అంతా అయిపోలేదని అన్నారు. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదని పేర్కొన్న సజ్జల ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు? అని ప్రశ్నించారు.
మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో లేరని పేర్కొన్న ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. మొన్ననే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్ కూడా చేశాముని పేర్కొన్న సజ్జల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టిడిపి పోటీ చేసిందని, అంటే తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చనే అనుమానం ఉందని అన్నారు. ఇక చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని విమర్శించిన ఆయన కౌంటింగ్ లోనూ టీడీపీ పాల్పడిన అవకతవకలను ఎన్నికల అధికారులు గుర్తించారని అన్నారు. ఇక గ్రాడ్యుయేట్స్ లో మాకు ఓట్లు బాగానే వచ్చాయని కానీ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ఓట్లను టీడీపీ కి బదిలీ చేశాయని సజ్జల అన్నారు. మేము మొదటి సారి టీచర్ ఎమ్మెల్సీ ల్లో పోటీ చేసి గెలవగలిగామని అయితే గ్రాడ్యుయేట్స్ లో కింది స్థాయిలో తీసుకుని వెళ్ళటంలో కొంత వెనుకబడ్డామని అన్నారు.