తెలుగుదేశం హయాంలో అమరావతి భూ సమీకరణ మొదలు అన్నింటా అక్రమాలు.. కబ్జాలు జరిగాయని..ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sajjala Ramakrishna Reddy: తెలుగుదేశం హయాంలో అమరావతి భూ సమీకరణ మొదలు అన్నింటా అక్రమాలు.. కబ్జాలు జరిగాయని..ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే లేకుండా అక్రమాలు ఎలా జరిగాయంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ నేతల వ్యాఖ్యల పైన స్పందించారు. ఇప్పుడు అమరావతి కూడా లేదని, అదే సమయంలో జరిగిన అక్రమాల పై చర్యలు లేకుండా పోతాయా అని ప్రశ్నించారు. నాటి ప్రభుత్వం లింగమనేని స్థలాల వద్ద రోడ్డు అలైన్ మెంట్ ఎందుకు మార్పు చేసిందని నిలదీసారు. కరకట్టపైన లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఎలా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. అగ్రిమెంట్ లేకుండా..అద్దె చెల్లించకుండా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. అద్దె కడుతున్నట్లుగా ఎక్కడా ఒప్పందాలు లేవని చెప్పారు. ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్స్ చంద్రబాబు పొందుతున్నారని సజ్జల వివరించారు. అక్రమ కట్టడం అని నిరూపణ అయిన తరువాత కూడా చంద్రబాబు అదే ఇంట్లో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
రాజకీయ ఆట నిబంధనలను మార్చిన నాయకుడు జగన్ అని.. గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న అభిమానం వ్యక్తం అవుతోందని తెలిపారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదు..ప్రతిపక్షాలన్నీ తోడేళ్ళ మందలా ఏకమై తమపై దాడి చేయాలని చూస్తున్నాయని ఆగ్రహించారు. రాజకీయం అంటే ఎత్తులు, పొత్తులతో కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలని తెలిపారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు అక్రమాలకు చిరునామా అని ఆగ్రహించారు. సీఎం జగన్ హయాంలో కోటి 60 లక్షల కుటుంబాలకు సంక్షేమ ఫలితాలు అందాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలి ఆలా చేయలేకపోతే ధైర్యంగా ఒప్పుకోగలగాలని సజ్జల అన్నారు. పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని సజ్జల అన్నారు.
ఇక మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కొందరు బటన్ నొక్కి పంపిణీ చేస్తున్నారని అపహాస్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలనలో ఉన్న లోపాలు సరిదిద్ది అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని మంత్రి ధర్మాన తెలిపారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బలహీనుల అవసరాలు అన్నీ తీరుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ పరిస్థితిని సరిదిద్దలేక పోయాయని అన్నారు.
వైసీపీ ప్రభుత్వమే ధైర్యంగా అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ..చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిపిస్తున్నారని అన్నారు. ఇన్నేళ్ళు ఆయినా 21 శాతం మంది అక్షరం ముక్క రాని వాళ్ళు ఉన్నారు..ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందని నేనడుగుతున్నానని అన్నారు. ఇది పాలనలోని లోపం కాదా? సీఎం జగన్ ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ప్రయత్నం 50 ఏళ్ళ కిందటే చేసి ఉంటే ఇవాళ రాష్ట్రం మరో రకంగా ఉండేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉందని స్పష్టం చేశారు.గతంలో కేంద్రం కూడా అవినీతిపై చేతులు ఎత్తేస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక అవినీతి నిర్మూలన జరిగిందని వెల్లడించారు.