Sajjala Ramakrishna Reddy : తెలంగాణపై ఘాటు వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy comments on Polavaram Height : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన అనుమతులేనని, తెలంగాణ వాదన అసంబద్ధమని, భద్రాచలానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రత్యేక ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే డిజైన్లు ఖరారు చేశారని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభ్యంతరం లేవనెత్తే ప్రయత్నం చేస్తే సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తు చేసిన ఆయన తెలంగాణ వైఖరి ఆడలేక మద్దెలుఓడు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పోలవరానికి సంబంధించి ప్రతి అంశం కేంద్ర పరిధిలోనే జరుగుతోందని, ఒక ఇంచ్ కూడా అటూ ఇటూ కాలేదని, కాఫర్ డ్యాం తాత్కాలిక నిర్మాణం… దాని ప్రభావం కూడా ఉండదని ప్రజల్లోకి ఒక స్టేట్ మెంట్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం మినహా మరొకటి కాదని సజ్జల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పోలవరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని, బ్యాక్ వాటర్స్ వల్ల ఇబ్బందులు సహజమేనని అన్నారు. బ్యాక్ వాటర్స్ వచ్చాయని తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను తీసేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఓట్ల కోసం ఇలా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని, ముందు పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో చూసుకోవాలని హితవు పలికారు.