Minister Roja: పర్యాటక రంగంలోనే రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు..రోజా
Minister Roja: విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకై ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా 15 రంగాలు ఈ పెట్టుబడులకు కీలకంగా మారాయి..అందులో పర్యాటకరంగం ఒకటి. ఆ శాఖ మంత్రి అయిన రోజా ఈసందర్బంగా మీడియాతో ముచ్చటించారు. జగన్ పై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, జగన్ అంటేనే ఒక బ్రాండ్.. జగన్ అంటేనే ఒక జోష్ అని ఏపీ పర్యాటక మంత్రి రోజా కొనియాడారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ, తిరుపతి, గండికోట, పిచ్చుకలంకలో ఒబెరాయ్ సంస్థ కొత్త హోటల్స్ ఏర్పాటు చేయనుందని చెప్పారు.
కేవలం పర్యాటక రంగంలోనే అత్యధికంగా రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఈ స్థాయిలో పర్యాటక రంగానికి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారని చెప్పారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఏపీ వైపు చూస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరి నామమాత్రపు ఒప్పందాలు కాదని ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్తామని తెలిపారు. తిరుపతిని టెంపుల్ టూరిజంగా, విశాఖను ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామనిఅన్నారు.