శ్రీశైలంలో అల్లర్లు… ఉగాది మహోత్సవాలలో టెన్షన్ టెన్షన్!
కర్నూలు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అల్లరి మూకల అరాచకం సంచలనం రేపింది. నిన్నటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో ఓ టీ దుకాణం వద్ద కన్నడ భక్తులు, స్థానికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడి జరిగింది. రెచ్చిపోయిన కన్నడ యువకులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. ప్రతిదాడిలో కన్నడ భక్తుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. షాపులు ధ్వంసం చేసి నిప్పు పెట్టిన దుండగులు,ఒక రకంగా భయానక వాతావరణం సృష్టించారు. గాయపడ్డ యువకుడిని శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్న సిద్దరామ శివాచార్య స్వామీజీ పరామర్శించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ పెద్దగా మారిందని, ఇద్దరి భాషలు వేరు…. అందుకే ఇంత తప్పు జరిగిందని అన్నారు. కర్ణాటకలో మల్లికార్జున స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు, కర్ణాటక భక్తులకు శ్రీశైలంలో ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. ఇటువంటి సమయంలో ఇరు రాష్ట్రాల వారు కలసిమెలసి ఉండాలని, ఇద్దరు వ్యక్తుల గొడవను ఇరు రాష్ట్రాల గొడవగా తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు. భక్తులందరూ శాంతియుతంగా ఉండాలి, కర్ణాటక ,ఏపీ భక్తుల మధ్య ఇప్పటివరకు జరిగిన గొడవలను మర్చిపోండి, గొడవలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గొడవల వల్ల పవిత్ర శ్రీశైలానికి చెడ్డ పేరు తీసుకు రావద్దని కోరారు.