వివేకా కేసు : సీబీఐకి రఘు రఘురామరాజు లేఖ!
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ చీఫ్‌కు లేఖ రాశారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కేసులో ఎలా జరిగిందో అలాగే ఈ కేసులో నిందితులను కూడా జైలులో చంపేసే అవకాశం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. జైలులో ఉన్న వారికి, జైలు వెలుపల ఉన్న నిందితులకు, ఈ కేసులో సాక్షులకు కూడా రక్షణ తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని వెంటనే ప్రశ్నించాలని కూడా సీబీఐని రఘురామ లేఖలో కోరారు . రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపిన తీరును రఘురామరాజు ప్రస్తావించారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి , ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు అప్రూవర్‌ల వాంగ్మూలాలు సూచిస్తున్నాయని, ఈ హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ చేతులు మారినట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై వివేకా కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించగా, అవినాష్‌రెడ్డిని అయితే సీబీఐ ఇంకా ప్రశ్నించలేదు. అవినాష్ రెడ్డికి ఏ క్షణంలోనైనా నోటీసులు అందుతాయని, వెంటనే అరెస్ట్ చేస్తారని గత నెలలో పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు.