ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్విడ్ ప్రోకో యుద్ధం నడుస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.
QUID PRO QUO : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో క్విడ్ ప్రోకో అంశం మరోసారి కలకలం రేపుతోంది. అయితే అది ఈసారి చంద్రబాబు (Chandra babu), టీడీపీ (Tdp)నేతల వంతైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (ysr) ఉన్న సమయంలో ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ (cm Jagan) క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. అప్పుడు సీబీఐ (cbi), ఈడీ (ed) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఇప్పుడు ఏపీ సీఐడీ (ap cid) రంగంలోకి దిగింది. ప్రభుత్వ నిర్ణయాల ద్వారా వ్యాపారులకు లబ్ది చేకూర్చి వాళ్లతో జగన్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో ఈడీ, సీబీఐ విచారణ జరుపుతుండగా.. గత ఎన్నికల్లో జగన్ సీఎం కావడంలో క్విడ్ ప్రోకో ఆరోపణలు ప్రభావం చూపలేదు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీపై క్విడ్ ప్రోకో అంశం ఎలాంటి ప్రభావం చూపనుంది? సీఐడీ నమోదు చేస్తున్న కేసులు న్యాయస్థానాల్లో నిలుస్తాయా? అనే ఉత్కంఠ నెలకొంది.
దెబ్బకు దెబ్బ..
అమరావతిలో (Amaravathi) టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో అక్రమాలు జరిగాయని సీఐడీ విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తునకు ఇటీవల సుప్రీంకోర్టు (Supreme court) పచ్చజెండా ఊపడంతో ఆస్తులు జప్తు (అటాచ్) (Attach) చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పట్లో ఎలాగైతే జగన్ (Jagan) ఆరోపణలు ఉన్నాయో.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని.. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా వైసీపీ కుట్రలో భాగమని ఆరోపిస్తోంది. ఈ క్విడ్ ప్రోకో యుద్ధంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముల్లును ముల్లుతోనే తీయాలనే నానుడి ఆచరిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు జగన్‌ను ఇరుకున పెడుతున్నారు. ఢిల్లీలో ఏ పనిమీద వెళ్లినా కేసుల రాజీ కోసమే అని ఆరోపిస్తున్నారు. ఆయన త్వరలోనే జైలుకు వెళ్తారని అంటున్నారు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా అదే తరహాలో ఏపీ సీఎం జగన్ క్విడ్ ప్రోకో ఆయుధం బయటకు తీశారు. ఆస్తుల అటాచ్‌తో పాటు తదుపరి చర్యలకు ఏపీ సీఐడీని రంగంలోకి దింపారు.
అసలు ఏం జరిగింది..?
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో క్విడ్ ప్రోకో (నీకిది-నాకది) జరిగిందని ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని (Undavalli) కరకట్ట రోడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని జప్తు (అటాచ్) చేసేందుకు ప్రభుత్వం సీఐడీకి అనుమతిచ్చింది. లింగమనేనికి రమేష్‌కు (Lingamaneni Ramesh) చెందిన 17-3-378/1 డోర్ నెంబర్ గల ఇంట్లో కొన్నోళ్లుగా బాబు ఉంటున్నారు. రాజధాని ప్రణాళిక డిజైన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు (inner ring road) అలైన్మెంట్ (Alignment)లింగమనేనికి అనుకూలంగా మార్పులు చేసి ఆ ఇంటిని తీసుకున్నారనేది ఏపీ సీఐడీ అభియోగం. అలైన్‌మెంట్‌ను కంతేరు, కాజ, నంబూరు గ్రామాల మీదుగా మళ్లించి లింగమనేనికి చెందిన భూముల విలువ పెరిగేలా కుట్ర చేశారని తద్వారా అనుచిత లబ్ది పొందారని అంటోంది. క్విడ్ ప్రోకో కింద లింగమనేని తన ఇంటిని చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని చెబుతోంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి నారాయణ (K.Narayana) బినామీల పేరిట కొన్న ఆస్తులని మరికొన్నింటిని కూడా అధికారులు జప్తు చేశారు.
ఎవరు ఫిర్యాదు చేశారు..?
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్, రాజధాని డిజైన్‌లో (design) క్విడ్ ప్రోకో జరిగిందని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (MLA RK) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు చంద్రబాబు , మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ సహా 14 మంది నిందితులుగా చేర్చారు. హెరిటేజ్ సంస్థ (Heritage), లింగమనేని, ఇతర నిందితులు వారి కంపెనీలకు చెందిన భూములు సేకరణ పరిధిలోకి రాకుండా నగర బృహత్ ప్రణాళిక ఖరారు చేశారనేది ఆరోపణ. గతంలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న నారాయణ తన అధికారాలను దుర్వినియోగం చేశారనేది సీఐడీ అభియోగం. స్టార్టప్ ఏరియా (Startup Area) ఎక్కడ వస్తుందో ముందే తెలిసి అక్కడ కేవలం రూ.3.66 కోట్లకే 58.50 ఎకరాలు నారాయణ కొనుగోలు చేశారని చెబుతోంది. పొత్తూరు ప్రమీల, నారాయణ బావమరిది రావూరి సాంబశివరావు, నారాయణ భార్య రమాదేవి బంధువు ఆవుల మునిశేఖర్ ఆ భూములను కొనుగోలు చేశారంటోంది. ఆ తర్వాత నారాయణ అల్లుడు పునీత్, అతని సోదరుడు వరుణ్ కుమార్ వార్షిక కౌలు కింద రూ.1.92 కోట్ల లబ్ది పొందారని సీఐడీ కేసులో చేర్చింది. వాళ్ల పేరుతో ఉన్న 75,800 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లను, బ్యాంకు ఖాతాల్లోని రూ.1.92కోట్ల నగదను జప్తు చేసేలా సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
అధికార పక్షం ఏమంటోంది..?
చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి రాజధాని వ్యవహారం నిదర్శనమని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) ఆరోపించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు విషయాల్లో అవకతవకలు జరిగాయని స్పష్టం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గ దర్శకాల మేరకే సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల (Sajjala) చంద్రబాబుపై మండిపడ్డారు. కరకట్ట నివాసం చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనమని అన్నారు. జగన్ రాజకీయ నిర్ణయాలు బాబుకు ఉరితాడు లాంటివన్నారు. తోడేళ్ల మందలా అందరూ ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విపక్షాలపై విరుచుకుపడ్డారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని అన్నారు. కరకట్ట నివాసం బాబు అక్రమాలకు చిరునామా అని..హెరిటేజ్ సంస్థ, లింగమనేని రమేష్ మధ్య లావాదేవీలు జరిగాయని సజ్జల స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా గొడవ చేయిస్తున్నారని కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల విమర్శించారు.
టీడీపీ వైఖరేంటి..?
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని అటాచ్ (Attach) చేయాలనే నిర్ణయం జగన్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని టీడీపీ ఆరోపిస్తోంది. ఆయన ఒకరి ఇంట్లో ఉండటమే నేరమా..? అని ప్రశ్నిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు అంశం తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో బెయిల్ (bail) ఆర్డర్లో కోర్టు స్పష్టం చేసిన మాట వాస్తవం కాదా? అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇల్లు చంద్రబాబు పేరుతో రిజిస్ట్రేషన్ జరగ లేదని.. లింగమేనేని గెస్ట్ హౌస్ అయినప్పుడు అందులో క్విడ్ ప్రోకో ఏముంటుందో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్-5జోన్‌పై స్టే నిరాకరణ..
రాజధాని ఆర్-5 జోన్లో (R-5 zone) పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కేసుకు సంబంధించి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలి చేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాల్ చేస్తూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కేసులో ఏపీ హైకోర్టులో (ap High court) రాజధాని రైతులకు ఊరట లభించింది. దాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో ఊరట దక్కింది. తాజాగా కేసు రాజధాని విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం (supreme court) ఆదేశాలిచ్చింది.