Draupadi Murmu: మీ ఓటు వేసి నన్ను గెలిపించండి,వైసీపీ ప్రజాప్రతినిధులను కోరిన ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్ధులు జోరు పెంచారు. అలుపెరుగకుండా ప్రచారం చేస్తున్నారు. గెలుపుకోసం రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను కలిశారు. తనకే ఓటు వేసి రాష్ట్రపతిగా గెలిపించాలని కోరారు.
ఆంధ్ర ప్రజలకు నా నమస్కారములు
ఆంధ్ర ప్రజలకు నా నమస్కారములు అంటూ ద్రౌపది ముర్ము తన ప్రసంగం ప్రారంభించారు. కవులు, కళాకారులు, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, అన్నామాచార్య, తెనాలి రామకృష్ణ, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీరారామారావు వంటి మహనీయులను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఘన చరిత్ర ఉంది
ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ఘన చరిత్ర గురించి ప్రస్తావించారు. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారి గురించి గుర్తుచేసుకున్నారు. తెలుగు భాషను, కూచిపూడి నాట్యాన్ని గురించి ప్రస్తావించారు. తిరుపతి, లేపాక్షి వంటి పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడారు. ఉప్పాడ, కళంకారీ చీరల గురించి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఆంధ్రలో ఎందరో మహానుభావులు
స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా అనేక పోరాటాల్లో పాల్గొన ఆంధ్ర ప్రదేశ్ నాయకుల గురించి ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. సైమన్ గో బ్యాక్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆంధ్రకు చెందిన అనేక నాయకులు పాల్గొన్న విషయాన్ని ముర్ము గుర్తుచేశారు.
ఆంధ్రలో పంటలకు దేశమంతటా ఆదరణ
ఆంధ్రప్రదేశ్‌లో పండే కొన్ని పంటలకు దేశమంతటా ఆదరణ ఉన్నట్లు ద్రౌపది ముర్ము తెలిపారు. ఇక్కడ పండే వరికి, ఇక్కడ ఉత్పత్తి అయ్యే చేపలకు దేశ వ్యాప్తంగా ఆదరణ ఉన్నట్లు ముర్ము వివరించారు.
మీ ఓటు వేసి నన్ను గెలిపించండి
ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నో సారూప్యతలున్నాయి. నేను ఒడిషాకు చెందిన గిరిజన మహిళను. సంతల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మీరందరూ నాకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. భారతదేశానికి స్వాతంత్రవచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఓ గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తోంది. నేను కోరక ముందే తనకు మద్దతు ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.