Gudivada: గుడివాడలో టెన్షన్ టెన్షన్!
Gudivada: కృష్ణాజిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గుడివాడలో చాలా రోజుల నుంచి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఇక ఈరోజు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాలు జరిపేందుకు టిడిపి శ్రేణులు సిద్ధమైతే ఈ వ్యవహారం మొత్తాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ప్రసంగిస్తున్న సమయంలో సిఐ గోవిందరాజులు కార్యక్రమానికి అడ్డు తగలడమే కాకుండా కార్యక్రమాన్ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బాహాబాహీకి దిగినట్లుగా తెలుస్తోంది. అయినా పోలీసులు వెనక్కి తగ్గకుండా కార్యక్రమాన్ని నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి పతనానికి నాంది మొదలైందని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా బయటపడిందని పేర్కొన్నారు. సిఐ గోవిందరాజులు, అనుమతులు లేకుండా రోడ్లమీద సంబరాలు ఏంటని పార్టీ నేతలను ప్రశ్నించగా టిడిపి నేతలు కూడా ఎదురు తిరగడంతో నెహ్రూ చౌక్ సెంటర్లో కొద్దిసేపు గందరగోళం చోటు చేసుకుంది. వివాదం జరుగుతుండగానే కార్యకర్తలు టపాసులు వెలిగించడంతో టిడిపి నేతలు విజయోత్సవ వేడుకలు ముగించి వెను తిరిగారు.