Perni Nani: అక్కడ టీడీపీ గెలవాలన్న పేర్ని నాని.. ఎందుకో తెలుసా?
Perni Nani: ఏపీ రాజకీయాలలో ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మధ్య రాజకీయం రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. సాధారణంగా ఇతర రాష్ట్రాలలో రాజకీయాలు ఇలా ఉండవు. కానీ ఎందుకో ఏపీలోనే ఢీ అంటే ఢీ అన్నట్టుగా అక్కడ నేతలు వ్యవహరిస్తూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థుల కంటే… ఏదో స్థలం తగాదా ఉన్నా ప్రత్యర్థుల లాగా… వీరు ఒకరి మీద ఒకరు దారుణమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు పార్టీల వారు కలిసి.. కనిపించేది ఒక్క అసెంబ్లీలో మాత్రమే. అక్కడ మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కలుస్తారు. అయితే ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ లాబీల్లో ఒక పార్టీ నేతలు… మరొక పార్టీ నేతలతో సరదాగా మాట్లాడుతూ ఛలోక్తులు వేసుకుంటూ ఉంటారు. కానీ ఏపీ అసెంబ్లీలో మాత్రం అలాంటి సీన్లు కనిపించవు.
కానీ ఈసారి మాత్రం ఏపీ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అదేమిటంటే అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు కొద్దిసేపు బాగా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ మాటలు కూడా తమ సొంత పార్టీ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే సాగాయని అంటున్నారు. అయితే వ్యక్తిగతంగా వచ్చేసరికి మీరు మరోసారి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్ని నాని చెప్పారట. దానికి పెద్ద విశేషమే ఉంది. అదేమిటంటే ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాదట.
2014లో ఆ సీటు వైసీపీ గెలుచుకుంది. అప్పుడు టీడీపీ గెలిచింది. కానీ 2019లో అక్కడ వైసీపీ ఓడిపోయింది. పయ్యావుల కేశవ్ గెలిచారు. దీంతో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు కూడా అంటే 2004, 2009లో కూడా పయ్యావుల కేశవ్ టీడీపీ తరఫున గెలిచారు. కానీ ఆ రెండు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి ఉరవకొండ సీటు యాంటీ సెంటిమెంట్ అనే వాదన వినిపిస్తోంది. తెలుగుదేశంలో ఎంత సీనియర్ నేత అయినా ఆయన మినిస్టర్ అనిపించుకోవడానికి కారణం కూడా ఇదే అనే వాదన వినిపిస్తోంది. అందుకే 2024 లో కూడా పయ్యావుల కేశవుని గెలవమని పేర్ని నాని కోరారు.
కాబట్టి 2024 ఎన్నికల్లో ఆయన గెలిస్తే పైన తమ ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్ని నాని ఉద్దేశం అని అంటున్నారు. దానికి పయ్యావుల కేశవ్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారట. అంటే 1994లో లాగానే ఉరవకొండలో గెలుస్తాం… ఏపీలో అధికారాన్ని సాధిస్తామని పాత వ్యవహారాన్ని బయటపెట్టారట. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఉరవకొండలోనూ టీడీపీ గెలిచింది. నందమూరి తారకరామారావు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే పేర్ని నాని 2019 ఫలితాన్ని రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ పయ్యావుల తాను గెలిచి టీడీపీ కూడా గెలిచేలా కృషి చేస్తానని అంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఉరవకొండ ఫలితం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.