Atmakuru by poll: ఆత్మకూరులో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్.. మధ్యాహ్నానికి 22 శాతం పోలింగ్ నమోదు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతోన్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. ఈ పోలింగ్‌లో ఆత్మకూరులోని పలు ప్రాంతాల్లో చదురు ముదురు ఘటనలు చెలరేగాయి. ఈ బై పోల్స్‌లో ఇప్పటి వరకు పోలింగ్ శాతం 22గా నమోదైంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల, ఆత్మకూరు, AS పేట, ఆనంతసాగరం మండలాల్లోని పోలింగ్ కేద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వైసీపీ అభ్యర్థి.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు.
ఈ ఎన్నికల్లో ఆరు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను తీసుకు వచ్చారు అధికారులు. ఆ ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడడంతో ఓటర్లు గంటల కొద్ది క్యూలైన్‌లో నిల్చున్నారు. మరోవైపు ఎన్నికలకు టీడీపీ, జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే మరణంతో ఆ టికెట్ ఆయన కుటుంబ సభ్యులకు కేటాయించడంతో ఎమ్మెల్యేకు సానుభూతిగా రెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపాయి. ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ పొటీ చేస్తోంది.