అనంతకు పవన్.. అక్కడి నుంచే శ్రీకారం
మంగళవారం అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తారు. ఆ తరువాత 10:30 నిమిషాలకు కొత్త చెరువు నుండి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక 11:20 నిమిషాలకు ధర్మవరం నుండి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్థిక సాయం చేస్తారు. అక్కడి నుంచి గం. 12: 10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారు 20 రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే గ్రామ సభలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్థిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. గ్రామ సభ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు.