Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ సమ్మిట్ కు పవన్ మద్దతు!
Pawan Kalyan on Global investor’s summit: టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి అంటూ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్ చేశారు. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశవిదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ ఆయన మొదటి ట్వీట్ చేశారు. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి అని ఆయన హితవు పలికారన్నారు. ఈ సమ్మిట్ ఆలోచనలను కేవలం విశాఖకే పరిమితం చేయవద్దు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్ లాగా మార్చండని ఆయన మరో ట్వీట్ చేశారు. ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుంది. ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న అంటూ ఆయన పేర్కొన్నారు.