Pawan Kalyan: బాబు-మోదీలను పవన్ కలుపుతారా?
Pawan Kalyan Strategy: జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఇప్పటికే ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరిగిన యువశక్తి అనే ఒక యువత ఆధారిత కార్యక్రమంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో లాగా ఒంటరిగా బరిలో దిగి వీరమరణం పొందే కంటే పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచిదని ఆయన సూచనలు ఇచ్చారు. అయితే ఆయన టిడిపితో పొత్తు పెట్టుకుంటారనే విషయం దాదాపు అందరికీ అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నుంచి తప్పుకుని తెలుగుదేశానికి దగ్గరవుతారా ? లేక బీజేపీని కూడా ఒప్పించి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు బిజెపిని కలుపుకుని తెలుగుదేశంతో రాజకీయం చేయాలని ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వేరువేరుగా వెళ్తే కచ్చితంగా అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందని పవన్ ఘంటా పదంగా చెబుతున్నారు.
నిజానికి వైసీపీ మీద పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ ఆశించారు కానీ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కాదు కదా వైసీపీ మీద గట్టిగా పోరాడుతామన్న సంకేతాలు కూడా లభించలేదు. అదే జనసేనాని ని టిడిపికి దగ్గర చేసిందనే ప్రచారం ఒకటి ఉంది. తర్వాత మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయినా సరే ఈ విషయం మీద క్లారిటీ రాకపోవడంతో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఎందుకో వైసీపీని టార్గెట్ చేయడానికి బీజేపీ తనకు సహకరించడం లేదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తన రోడ్ మ్యాప్ తానే సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అవసరమైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడానికి సిద్ధం అనే సంకేతాలు పంపడంతో బిజెపికి ఒక రకంగా మింగుడు పడడం లేదని చెప్పాలి. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కాదు కదా అభ్యర్థులు వెతుక్కోవడం కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టమైన పని.
ఇప్పటివరకు జనసేన ఉంది కదా పవన్ అభిమానులు ఉన్నారు కదా అనే ధీమాతో ఉన్న బిజెపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యూహాలతో ఇరుకున పడింది. అయినా పవన్ కోరుతున్నట్లుగా గత అనుభవాల దృష్ట్యా తెలుగుదేశంతో కలవడానికి ఏపీలోని బిజెపి నేతలు చాలామంది సుముఖంగా లేరు. కానీ పవన్ కళ్యాణ్ ప్రెజర్ తో ఒకవేళ బిజెపి అధిష్టానం తెలుగుదేశంతో కలిసి నడవడానికి సిద్ధమైతే ఇక వారంతా తప్పకుండా పవన్ వెంట తెలుగుదేశం వెంట నడవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. ఇదే విషయం గతంలో ఎన్నిసార్లు నిరూపితం అయింది. ఇక మీదట కూడా నిరూపితం అవుతూనే ఉంటుంది. సో జనసేనాని ప్రయత్నం బిజెపిని తెలుగుదేశాన్ని మళ్లీ కలుపుతుందా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తే ఈ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..