Pawan Kalyan New Plan: పవన్ కళ్యాణ్ మాస్టర్ స్కెచ్.. మామూలుగా లేదుగా!
Pawan Kalyan New Plan: వాస్తవానికి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు ఆటలో అరటికాయ లాగానే తీసివేస్తూ ఉండేవారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసినా గెలవలేక రెండు చోట్ల నుంచి ఓడిపోవడంతో ఆయనని అసలు లెక్కలోకి తీసుకునేవారు కాదు. సభల్లో ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే రాజకీయ అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు. 2024 ఎన్నికల్లో వైసీపీని అధికారానికి దూరం చేయడంతో పాటు, జనసేన ను అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవడం కంటే , పొత్తులతో వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే టిడిపితో పొత్తు పెట్టుకున్నా, అరకొర సీట్లతో సరిపెట్టకుండా , వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమకు అవకాశం కల్పిస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుందనే సంకేతాలను పవన్ ఇప్పటికే పంపించగా అక్కడి నుంచి కూడా కొంత సానుకూలంగానే పరిస్థితులు ఉన్నాయి. ఇక తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ విషయంలో పవన్ ఒక క్లారిటీ కి వచ్చారని, ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు జనసేనను కలుపుకుని వెళ్లే విషయంలో అంత ఆసక్తి చూపించకపోవడంతో ఆయన విసిగిపోయారని అంటున్నారు.
ఇక ఈ మధ్య పొత్తులో ఉన్నా సరే జనసేన బీజేపీలు విడివిడిగానే రాజకీయ కార్యక్రమాలు చేపడుతుండడం తదితర కారణాలతో సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు పవన్. కానీ కేంద్ర బీజేపీ పెద్దల విషయంలో ఆయన ఎప్పుడూ సానుకూలంగానే ఉంటున్నారు. ఇక అలా ఆయన ఉండడానికి కూడా అనేక కారణాలు అనేకం ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే పవన్ ఏపీలో పొత్తులు విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో టిడిపితో అసెంబ్లీ సీట్ల విషయం తో పాటు , పార్లమెంటు స్థానాల విషయంలోనూ ఒక క్లారిటీతో ఉన్నారని అంటున్నారు. ఏకంగా 9 పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా డిమాండ్ చేయాలని జనసేన భావిస్తుందని అంటున్నారు.
అలా చేయడానికి కారణం రాష్ట్ర రాజకీయాలతో పాటు, ఢిల్లీ రాజకీయాల్లోనూ జనసేన చక్రం తిప్పాలని భావించడమే అని అంటున్నారు. కేంద్ర బిజెపి పెద్దలకు మరింత దగ్గర కావడం ద్వారా, రాజకీయంగా జనసేనకు జరగబోయే మేలు, వీటన్నిటిని లెక్కలు వేసుకుంటున్న పవన్ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు విషయంలోనూ టీడీపీని ఒప్పించాలని భావిస్తున్నారని టాక్. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, వీలైనంత ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని పవన్ భావిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన తరఫున ఎంపీ స్థానాల్లో పోటీ చేయగలిగిన సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలను వెతికే పనిలో ప్రస్తుతం జనసేన కొర్ టీమ్ ఉందని అంటున్నారు. అలాగే సినీ గ్లామర్ ఉన్నవారిని కూడా రంగంలోకి దించే యోచనలో ఉందని అంటున్నారు.