Pawan Kalyan: అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాలి!
Pawan Kalyan: బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు, సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్ చేశారు. ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్న ఆయన ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదు అనేది తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించిందని అన్నారు. అలాంటిది తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై ఆ పార్టీ సమాధానం చెప్పాలని అన్నారు. ఈ అన్యాయంపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్ బీసీ కులాల తొలగింపుపై వైసీపీ, టీడీపీ స్పందించాలని డిమాండ్ చేసారు. నేను ఒక కులానికి మాత్రమే పరిమితం కాదన్న ఆయన ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారని, బీసీలకు అవకాశం ఇస్తేనే కదా నాయకత్వం ఎదిగేది అని అన్నారు. బీసీ కులాలకు జనసేన అండగా ఉంటుంది. ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుందని పవన్ ఈ క్రమంలో పేర్కొన్నారు.