కోనసీమ అల్లర్లు వైసీపీ ప్లాన్ ప్రకారమే : పవన్ కల్యాణ్
మంగళగిరి జనసేన పార్టీలో విస్తృత స్థాయి సమావేశం అనంతరం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్లను కుల ఘర్షణలు అని వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తుండడాన్ని తాము సునిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. భారతదేశ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్న విషయం అందరూ అంగీకరించాల్సిందేనని, ఎన్నికల్లో కుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కులాలపై ఆధారపడే పార్టీలో వైసీపీ కూడా ఒకటి, కులాలు విభజించి పాలించాలని వాళ్లు ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. తాను కులాలను కలపాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.
అన్ని కులాల వారు శ్రమిస్తేనే ఈ సమాజంలో పనులు జరుగుతాయని, నోటికి ముద్ద చేరాలన్నా దాని వెనుక ఎన్నో కులాలు కష్టం ఉంటుందని పవన్ పేర్కొన్నారు. కులాల నేపథ్యంలో నడుస్తున్న సమాజంలో గొడవలు జరుగుతుంటాయని అన్నారు. నాడు వంగవీటి రంగా వ్యవహారంలో విజయవాడలో రెండు కులాలు విడిపోయిన పరిస్థితి ఏర్పడిందని, విజయవాడ నెలరోజుల పాటు తగలబడిపోయింది అని అన్నారు. అయితే తెలంగాణలో కులాలను మించి ‘తెలంగాణ’ అనే భావన ఉంటుంది, కానీ మనకు ‘ఆంధ్రా’ అనే భావన లేదని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఎంతో ప్రశాంతమైన కోనసీమ ఇవాళ భగ్గున రగిలిపోయిందంటే దానికి కారణం వైసీపీనే. ఎంతో పక్కాగా ప్రణాళిక వేసి గొడవలు రేకెత్తించారని పవన్ ఆరోపించారు. ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వైసీపీ గెలిచిందని అన్నారు.