Pawan Strategy: కొత్త వ్యూహాలతో పవన్ – పొత్తు ఎవరితో
Janasena Chief Pawan Kalyan implementing new strategies to face YCP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ సవాల్ చేస్తున్నారు. 175 సీట్లు వైసీపీ గెలుస్తామంటే చూస్తూ కూర్చుంటామా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికలు కీలకమని చెప్పిన పవన్, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కానీ, పొత్తుల సంగతి పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వైసీపీ పైన పోరాటానికి ప్రధానికి చెప్పి చేయాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ కోటలు బద్దలు కొడతానని హెచ్చరించారు. తన మీద నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి కొనసాగింపు గా 2024 తో పాటుగా 2029 ఎన్నికల గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ తరువాత తొలి సారి వైసీపీని లక్ష్యంగా చేసుకున్నారు. తాను ప్రధానితో మాట్లాడిన సమయంలో జాతీయ అంశాల గురించే మాట్లాడుతానని చెప్పారు. ప్రతిదీ మోదీకి చెప్పి చేయనని, తాను ఆంధ్రాలో పుట్టాను..ఆంధ్రాలోనే తేల్చుకుంటానంటూ పవన్ శపథం చేసారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటూ వైసీపీకి సవాల్ చేసారు. బీజేపీతో సంబంధం లేకుండా వైసీపీని కొడతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే తాను ఒంటరి పోరాటానికి సిద్దం అవుతాననే సంకేతాలు ఇచ్చారు. అటు బీజేపీ తమతోనే పవన్ అని, ఇటు జనసేనతో టీడీపీ పొత్తు పైన ప్రచారం జరుగుతున్న సమయంలో వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల్లో తాను ఏ పార్టీతో ఉంటాననేది పవన్ క్లారిటీ ఇవ్వలేదు. తన సొంత బలం ఏంటో ఒక అంచనాకు వచ్చిన తరువాతనే పవన్ ఎవరితో కలవాలనే దాని పైన నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు పవన్ జనసైనికులతో టీడీపీ పల్లకి మోయిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీని కాదని పవన్ బీజేపీతో ముందుకెళ్తే వైసీపీకి మేల చేస్తుంది. వైసీపీని 2024 లో ఓడించటమే తన లక్ష్యమని పవన్ చెబుతున్నారు. కానీ, గతంలో చెప్పిన వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే నినాదం మాత్రం పవన్ ఇప్పుడు ప్రస్తావించటం లేదు. ప్రధానితో పవన్ భేటీ తరువాత ఇక, టీడీపీతో జనసేన పొత్తు ఉండదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ప్రధాని తో భేటీ తరువాత ఇప్పటి వరకు బీజేపీ నేతలతోనూ సమావేశాలు జరగలేదు. పవన్ లక్ష్యం వైసీపీ అనేది స్పష్టం. కానీ, పొత్తుల విషయంలోనూ పవన్ డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడే పొత్తుల గురించి స్పందించాల్సిన అవసరం లేదనేది జనసేన నేతల అభిప్రాయం. అటు టీడీపీ వేచి చూసే ధోరణితో ఉంది. జగన్ ను ఓడించేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దంగా లేరు. వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో ప్రధానితోనూ భేటీకి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో పదే పదే 2024 ఎన్నికలతో పాటుగా 2029 ఎన్నికల గరించి చెప్పటం మరి కొంత డైలామకు కారణమవుతోంది. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ఓటమి ఖాయమనే అంచనాలు ఉన్నాయి. పొత్తులు లేకుండా వేర్వేరుగా పోటీ చేస్తే అది వైసీపీకి అవకాశం ఇచ్చినట్లే. అందుకు పవన్ సిద్దంగా లేరనేది ఆయన మాటల జోరులో కనిపిస్తోంది. బీజేపీతో వెళ్లటం వలన వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎటువంటి ప్రయోజనం లేదనే వాదన కూడా ఉంది. బీజేపీతో పొత్తు కారణంగా కొంత మేర బీజేపీకి కలిసి వచ్చినా.. వైసీపీని ఓడించాలనే లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇన్ని రకాల సమీకరణాల నడుమ పవన్ కల్యాణ్ నిర్ణయం కీలకం కానుంది. ఈ సస్పెన్స్ వీడాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.