అసత్యాలు పలకడంలో పవన్ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు: మాజీ మంత్రి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో హింసాత్మక ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందురు అసాంఘీక, సంఘ విద్రోహుల వల్ల ఆ ఘటనలు జరిగాయన్నారు. గతంలో కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు అన్నారని, దానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే టీడీపీ, జనసేన నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అబద్దాలు మాట్లాడలేపోయేవారన్న కోడాలి నాని.. ఇప్పుడు ఆయన ఆబద్దాలు ఆడటంలో డిగ్రీ పొందారని విమర్శించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు చేయించిన జనసేన, టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ నిర్ణయం వల్లే ఇలా జరిగిందని వారి నేరాన్ని ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కోనసీమ ఇతివృత్తంలో ప్రతిపక్ష పార్టీ నేత, ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసే ఈ దాడి చేశారని కొడాలి నాని అన్నారు. పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కన్పిస్తుందన్న కొడాలి నాని.. చంద్రబాబు మోసాలు చేయడంలో దిట్టా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవడం రాష్ట్రనికి పట్టిన దరిద్రం అన్నారు.