Megastar Chiranjeevi: వద్దురా సోదరా…నాకొద్దు ఈ రాజకీయం ‘రోత’రా!
No Politics Says Megastar Chiranjeevi: అప్పుడెప్పుడో సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ రాజకీయాలు ఏమాత్రం కలిసి రావనే విషయం అర్థమై పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 2017 ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న ఆయన ఆ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్లో ఎంతో కీలకమైన నేతలకు కూడా మెగాస్టార్ చిరంజీవి టచ్ లో లేరు. పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టిన ఆయన వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే మెగాస్టార్ అంటే ఒక క్రేజ్ ఉంది దాన్ని మరింత పెంచుకుంటూ తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. పైకి ఎంతవరకు తనకు ఆ బాధ్యతలు వద్దు అని చెబుతున్నా సరే పెద్దన్న పాత్ర పోషించేందుకే ఆయన ఆసక్తి చూపిస్తున్నారు అనే వాదన టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే తన రాజకీయ భవిష్యత్తు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తాను కూడా రాజకీయాల గురించి మాట్లాడాలా అని ప్రశ్నించిన ఆయన అసలు తనకు రాజకీయాలతో ముఖ్యంగా ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వీలైనంతవరకు తాను రాజకీయ అంశాలకు దూరంగానే ఉంటానని తనకు అది వర్కౌట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. ఒకరకంగా వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద ఒకపక్క నాగబాబు మరోపక్క పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా చిరంజీవి మాత్రం ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తుందని జగన్ పరిపాలన బాగుందని సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ జగన్ తమకు సహకరిస్తున్నారని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు తన అండ ఉంటుందంటూనే జగన్ ను ఇలా పొగిడేయడం చూస్తుంటే చిరంజీవి ప్రస్తుతానికి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటాడు, అనిపించుకుంటాడు ఎప్పటికైనా నిలబడతాడు అంటూ పలు సందర్భాలలో చెప్పుకొచ్చిన చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎప్పటికి నిలబడతాడో? ఈలోపు నేను అందరితో గొడవలు ఎందుకు పెట్టుకోవాలి? అని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఒక రకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూనే రాజకీయ నాయకుల అందరితో సఖ్యతగా మెలుగుతూ వస్తున్నారు. ఇక తనకు జీవితంలో మళ్ళీ రాజకీయాల వైపు చూసే అవకాశమే రాదని వచ్చినా వెళ్ళేది లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. సో మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ లైట్ తీసుకుని తన రాజకీయం తాను చేసుకుంటే ఫ్యామిలీ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు విశ్లేషకులు.