MP Raghurama Krishnaraju: ఆ అధికారులను ఎవరూ రక్షించలేరు: రఘురామ రాజు
Raghurama Krishnaraju Fire On AP Police: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పోలీసులపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుల ప్రాపకం కోసం తప్పులు చేసే పోలీసు అధికారులను ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఉండేది మరికొన్ని రోజులేనని, అది మళ్లీ రాదని జోస్యం చెప్పారు. పేదలకు అన్నం పెట్టాలని చూసే వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని, విజయవాలో చెన్నుపాటి గాంధీ కన్ను తొలగించాలని చూసిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని గుర్తు చేశారు. వివేకా హత్యకేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారి రాంసింగ్‌ను కూడా వదల్లేదని, ఆయనపైనా ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు.
అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రకు డీజీపీ అనుమతి ఇవ్వకున్నా హైకోర్టు అనుమతి ఇచ్చిందని, ప్రజల ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రకు అనుమతినిచ్చిన న్యాయమూర్తికి అమరావతి రైతుల తరపును శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు ప్రాజెక్టులు పెడతానంటూ ముందుకొచ్చిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి గతంలో జగన్‌మోహన్‌రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని రఘురామరాజు పేర్కొన్నారు.