YS Jagan: జగన్ కు తలనొప్పిగా మారిన కుమ్ములాటలు?
New tension to Jagan: 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 2019 ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీ సాధించి 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అయితే ఈసారి 175 సీట్లకు 175 సీట్లు మనమే సాధించాలంటూ పార్టీ నేతలకు భారీ టార్గెట్ విధించిన జగన్ అది సాధించాలని ఇప్పటికే పార్టీ నాయకులు, మంత్రులకు పర్సనల్గా కూడా టార్గెట్లు విధించారు. అంతేకాక ఈ వ్యవహారం మీద ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చింది? ఎలా ప్రచారాలు జరుగుతున్నాయి అనే విషయం మీద దృష్టి పెడుతున్నారు. ఒక రకంగా వైయస్ జగన్ వాలంటీర్ వ్యవస్థను తన సొంత ఎమ్మెల్యేలు కార్యకర్తల కంటే ఎక్కువగా నమ్మారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేది వారేనని భావించిన జగన్ వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.
అయితే ఎన్నికలకు వెళ్లే ముందు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో పాల్గొనకుండా కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తుంది అని భావిస్తున్న ఆయన ఇప్పుడు కొత్తగా గృహ సారధులు అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అంతేకాక కచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కుంటుపడే లోపు వారి ద్వారానే ప్రతి ఇంటిని సందర్శింపజేయాలని టార్గెట్లు పెట్టుకుని గడపగడపకు ప్రోగ్రాం సృష్టించారు. ఈ ప్రభుత్వం సంక్షేమం తప్ప అభివృద్ధి జోలికి వెళ్లడం లేదు అప్పులు తీసుకువచ్చి ప్రజలకు పంచుతున్నారు తప్ప వాటిని తీర్చే నాధుడు లేరు అనే విషయాన్ని తెలుగుదేశం సహా ఇతర పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుమ్మా వాటిని తిప్పి కొట్టే నేతలు వైసీపీలో లేరని జగన్ భావిస్తున్నారు. దానికి తోడు తనను వెనకేసుకు రావాల్సిన నేతలే తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తపరుస్తూ ఉండడంతో ఆయనకు టెన్షన్ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆనం ఆ తరువాత వసంత వంటి వారు టెన్షన్ పెడుతున్నారు. మరోపక్క నియోజకవర్గం వారీగా ఎప్పటికప్పుడు పీకే టీమ్ ఇస్తున్న రిపోర్టులు కూడా జగన్ టెన్షన్ను మరింత పెంచేస్తున్నాయని అంటున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయి రిపోర్టులు అందించిన ఐప్యాక్ టీం ఇప్పుడు మండల స్థాయిలో కూడా రిపోర్టులు అందిస్తూ రావడం జగన్ కు తలనొప్పిగా మారింది. అయితే ఈ ఐప్యాక్ టీం సర్వేలు చేసేందుకు వెళుతుంటే వారి ముందు కూడా సొంత పార్టీ నేతలు తన్నుకుంటున్న వ్యవహారాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరులో రెండు మండలాలలో ఐప్యాక్ సర్వే సమావేశం నిర్వహిస్తే అక్కడ లోకల్ లీడర్లు ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.
కచ్చితంగా ఇక్కడి ఎమ్మెల్యేకి సీట్ ఇస్తే తామే ఓడించి తీరుతామని వాళ్లు బాహాటంగానే వార్నింగ్ ఇవ్వడంతో ఏం చేయాలో పాలు పోక అదే రిపోర్టు అధిష్టానం వరకు తీసుకు వెళ్లిందట ఐప్యాక్ టీం. కేవలం ఈ నియోజకవర్గం పరిస్థితి ఒక్కటే కాదని చాలా నియోజకవర్గాలలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఎట్టి పరిస్థితులలో 175 సీట్లకు 175 సీట్లు సాధించి తీరాలని టార్గెట్ పెట్టుకున్న జగన్కు ఈ కుమ్ములాటలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సొంత పార్టీ మీదలే తన్నుకుంటుంటే పరిస్థితి ఏమిటో అని ఆయన దీర్ఘాలోచనలో పడ్డారని పరిస్థితి ఎలా అదుపులోకి తీసుకురావాలా అనే విషయం మీద ఆలోచనలు జరుపుతున్నారని అంటున్నారు.