మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం. అటువంటి మహా క్షేత్రంలో ఇప్పుడు రాజకీయం మొదలైంది.
Srisailam Kumbabishekam: మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం. అటువంటి మహా క్షేత్రంలో ఇప్పుడు రాజకీయం మొదలైంది. ఆచారాలు..సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయి. తాజాగా శ్రీశైలం క్షేత్రంలో వైభవంగా నిర్వహించాల్సిన మహాకుంభాభిషేకం ఇప్పుడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. సుదీర్ఘ కాలంగా వస్తున్న సంప్రదాయం కాదని..తమకు ఆరాధ్యంగా భావిస్తున్న కొత్త స్వామిజీని రంగంలోకి దించారు. భక్తితో నిర్వహించాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇప్పుడు వివాదంగా మారటానికి కారణమైంది. ప్రభుత్వ నిర్ణయంతో మొదలై వివాదం తారా స్థాయికి చేరింది. కోట్లాది రూపాయాలతో ఏర్పాట్లు చేసి చివరకు ఏకంగా కార్యక్రమాన్నే మొత్తంగా వాయిదా వేసింది.
శ్రీశైలంలో ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాల్సిన మహా కుంభాభిషేక్ వాయిదా పడింది. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే రూ 2.50 కోట్లతో ఏర్పాట్లు చేసింది. ఇందుకు పైకి ఎండలు అనే కారణాలు చెబుతున్నా అసలు కారణం వేరుగా ఉంది. ఈ నిర్ణయం వెనుక రాజకీయం బయటకు వచ్చింది. శ్రీశైలం దేవస్థానానికి ఆగమ సలహాదారుగా శృంగేరీ పీఠం వ్యవహరిస్తోంది. దేవస్థానంలో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరపాలన్నా, మార్పు చేర్పులు చేయాలన్నా శృంగేరీ పీఠాన్నే సంప్రదిస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్థాపించిన తొలి, దక్షిణాది పీఠంగా శృంగేరీ పీఠానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ పీఠం ప్రభుత్వంలోని ముఖ్యులకు కావాల్సింది కావటంతో మరింత ప్రాధాన్యత పెరిగింది.
ప్రభుత్వం కొలువు తీరటం.. మంత్రివర్గ విస్తరణ..పాలనా పరమైన నిర్ణయాలకు ఆ పీఠం నిర్ణయించిన మహూర్తాలే కీలకం అవుతున్నాయి. ఇప్పుడు శ్రీశైలంలో మహా కుంభాభిషేకాన్ని తామే నిర్వహిస్తామంటూ విశాఖ పీఠం ముందుకొచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రభుత్వం నుంచి ఓకే చెప్పారు. దీంతో, ఆలయ అధికారులు కొద్ది రోజుల క్రితం మహాకుంభాషేకం నిర్వహణపైన సలహాలు, సూచనలు కోసం విశాఖ శారదా పీఠాన్ని సంప్రదించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు జరపాలంటూ స్వామీజీ ముహూర్తం పెట్టారు. ఈ విషయంలో శృంగేరీ పీఠాన్ని అధికారులు అస్సలు సంప్రదించలేదు. శ్రీశైలంలో చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా శృంగేరీ పీఠం సలహాలు స్వీకరించడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఇప్పుడు ఆలయంలో నిర్వహించే ముఖ్య కార్యక్రమమైన మహా కుంభాభిషేకం విషయంలో కనీసం శృంగేరీ పీఠాన్ని సంప్రదించలేదు. దీంతో వివాదం మొదలైంది. మహాకుంభాభిషేకానికి విశాఖ శారదా పీఠం పెట్టిన ముహూర్తం సరైనది కాదని తేల్చిచెప్పారు. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదంగా మారింది. కుంభాభిషేకం నిర్వహణ సారథ్యంతోపాటు… ఇది ఎవరి చేతులమీదుగా జరగాలనే అంశంపైనా వివాదం చోటు చేసుకుంది. శ్రీశైలంలో స్వామివారి కైంకర్యాలను వీరశైవులు నిర్వహిస్తారు. అమ్మవారి కైంకర్యాలు స్మార్థ ఆగమం ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు మహాకుంభాభిషేకం విషయంలో వీరిద్దరి మధ్య అంతరాలు వచ్చాయి. మహా కుంభాభిషేకం తామే నిర్వహిస్తామని స్మార్థలు.. తమ చేతుల మీదుగానే జరగాలని వీరశైవుల మధ్య పోటీ నెలకొంది. మధ్యలో పీఠాధిపతుల ప్రతినిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారు. చివరికి… స్వామి, అమ్మవారికి పూజారులు ఎవరికి వారే కుంభాభిషేకం నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ప్రముఖులను ఆహ్వానించారు. ఈ సమయంలోనే కొత్త అభ్యంతరాలు తెర మీదకు వచ్చాయి. మొత్తం కార్యక్రమం స్మార్థ ఆగమశాస్త్రం ప్రకారమే జరగాలని పట్టుబట్టారు. దీంతో మహా కుంభాభిషేక నిర్వహణే సందిగ్ధంలో పడింది. ఇది ఇప్పట్లో పరిష్కారమయ్యేది కాదనుకుని… కార్యక్రమాన్నే వాయిదా వేశారు. శ్రీశైలంలో పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహించాలి. ఐదేళ్ల క్రితం మహాకుంభాభిషేకం నిర్వహణకు సిద్ధం అయ్యారు. కానీ… అప్పుడు కూడా అయ్యవారి, అమ్మవారి అర్చకుల మధ్య విభేదాలతో అది ఆగిపోయింది. ప్రముఖ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది దేవాదాయ శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.