TDP – JS Alliance: పొత్తుల వెనుక కొత్త లెక్కలు .. సీట్లు..అధికారంలో షేరింగ్..!
TDP Janasena Alliance discussions going on to finalise seats and Power sharing: పవన్ కల్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఇది శుభవార్తే. కానీ, టీడీపీ శ్రేణులకు మాత్రం మింగుడుపడని వార్త! వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గద్దె దించి తిరిగి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అందుకు కలిసివచ్చే అన్ని అంశాలనూ వినియోగించుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నేత్రుత్వంలోని జనసేనతో పొత్తుకు ఎప్పటినుంచో సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీని కూడా పొత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, పవన్ కల్యాణ్ నుంచి చంద్రబాబుకు ఊహించని డిమాండ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 స్థానాల్లో తమకు 40నుంచి 50 సీట్లు ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లు సమాచారం.
గత (2019) ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు తమ పార్టీ చాలా బలపడిందని చెబుతున్నట్లు తెలిసింది. అంతేకాదు.. రెండు పార్టీల కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అధికారాన్ని కూడా పంచుకోవాలనే ప్రతిపాదన పెట్టినట్లు చెబుతున్నారు. ఐదేళ్ల పదవీకాలంలో ముఖ్యమంత్రి పదవిని సమానకాలానికి పంచుకోవాలని, ఇందులో భాగంగా తొలుత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో చంద్రబాబును కలుసుకున్నప్పుడే ఈ విషయాన్ని ఆయన ముందు ఉంచినట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. ఒకవేళ ఇదే నిజమైతే.. టీడీపీకి ఇబ్బందికర పరిస్థితేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన డిమాండ్‌లకు అంగీకరించకపోతే పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అప్పడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనా టీడీపీ నేతల్లో ఉంది.
ఇదే జరిగితే.. మరో ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం ఆ పార్టీకి అంత సులువు కాదు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసేదాకా జగన్ ఊరుకోరు. టీడీపీ కనుమరుగైతే ఆ స్థానంలోకి తాము రావాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ కూడా అందుకు సహకరించే అవకాశం ఉంది. దీంతో మరోసారి జగన్‌కు అవకాశం ఇచ్చి తాను ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడానికి చంద్రబాబు ఇష్టపడరు. అందుకే పవన్ కల్యాణ్ డిమాండ్‌ను పరిశీలించే చాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. కానీ, ముఖ్యమంత్రి పదవిలో తొలుత పవన్‌ను కూర్చోబెడితే.. చంద్రబాబు శపథం ఏమవుతుందన్న ప్రశ్నలు టీడీపీ వర్గాల్లో తలెత్తుతున్నాయి. శాసనసభలో తన కుటుంబసభ్యులపై అధికార వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన చంద్రబాబు.. తాను మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టబోనని, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని శపథం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు జనసేనతో కలిసి మెజారిటీ సాధించినా.. తొలుత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సి వస్తే.. శపథాన్ని ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకం. అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్పప్పుడు ఒక అడుగు వెనక్కి వేయక తప్పదని పలువురు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన దేవేంద్ర ఫడణవీస్.. ఇప్పుడు శివసేనకు చీలిక వర్గం నేత ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసి తాను ఉపముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని ఉదహరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా వ్యవహరించడం ఫడణవీస్‌కు ఇష్టం లేకపోయినా.. బీజేపీ అధిష్ఠానం ఒత్తిడితో ఒప్పుకోక తప్పలేదు. చంద్రబాబు కూడా జగన్ రూపంలో ముందున్న ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పవన్ కల్యాణ్ డిమాండ్‌కు అంగీకరించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వైసీపీ నేతలు మాత్రం ఇన్నాళ్లుగా తాము చెబుతున్నట్లుగా పవన్‌కల్యాణ్ టీడీపీ కోసమే పనిచేస్తున్నారని, ఇప్పుడు ముసుగు తొలగిపోయిందని అంటున్నారు. ప్రజలు వీరి వ్యవహారాన్ని అర్థం చేసుకుంటారని, రెండు పార్టీలకు తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు.