సిద్ధమైన కొత్త మంత్రివర్గం జాబితా..సీల్డ్ కవర్ లో గవర్నర్ వద్దకు?
ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ కూర్పులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేశారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇప్పటికే ధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు ఎక్కువగానే చాన్సు దొరికే అవకాశం కనిపిస్తోందని అంటున్నా మొదట ఇద్దరు ముగ్గురికే పరిమితమైన పాత మంత్రులు ఇప్పుడు 10 మందికి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సజ్జల వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపు మూడు గంటల సేపు సమావేశం జరిగింది. ఇక రెండో రోజు కూడా మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇక దాదాపు కొత్త మంత్రివర్గం జాబితా సిద్ధమైనట్లు చెబుతున్నారు. మాజిక సమీకరణలు, అనుభవం, పార్టీ విధేయత అంశాల ఆధారంగా జాబితా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు సీల్డ్ కవర్ లో జాబితా పంపే అవకాశం ఉందని అంటున్నారు. ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. 11 ఏప్రిల్ నాడు ఉదయం 11.31 నిమిషాలకు ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.