New Alliance Formula in AP: పవన్ సీఎం… చంద్రబాబు దిగిరాక తప్పదా?
New Alliance Formula in AP: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తుండగా, అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ చూస్తున్నది. రెండు పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేయాలని చూస్తున్నాయి. ఇక, ఎన్నికల కోసం పొత్తుల వ్యవహారం కూడా నడుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య దాదాపుగా పొత్తులు ఖరారయ్యాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏపీలో కాపులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక విషయాల గురించి చర్చించారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుల అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పోత్తులు దాదాపుగా ఖరాయ్యే అవకాశం ఉండగా, పవన్ కళ్యాణ్ మార్చి 14వ తేదీన దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ కేవలం 20 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారని, దానికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతున్నట్లు రామ జోగయ్య తెలిపారు.
ఈ ప్రచారాలకు మార్చి 14వ తేదీన తెరపడే అవకాశం ఉన్నది. పొత్తులపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే, హరి రామజోగయ్య అంచనాల ప్రకారం, వచ్చే ఎన్నికల విషయంలో ఓ మెట్టు దిగిరాక తప్పదని తెలిపారు. జగన్ ను ఓడించాలి అంటే, చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, చంద్రబాబు సీఎం పదవి కోసం కాకుండా పవన్‌ను సీఎం చేసేందుకు ప్రయత్నించాలని అప్పుడే ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడమే కాకుండా, జగన్‌కు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. పవన్ ను సీఎం చేసి, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, అదేవిధంగా లోకేష్‌కు రాష్ట్రబాధ్యతలు అప్పగించాలని సూచించారు.
పవన్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించినపుడే రాష్ట్రంలో అసలైన ఎన్నికల వాతావారణం నెలకొంటుందని అన్నారు. అలా కాకుండా చంద్రబాబు చివరి అవకాశం అంటూ తానే మరోసారి ముఖ్యమంత్రిగా ఉండేందుకు ప్రయత్నిస్తే వ్యూహం బెడిసికొట్టే అవకాశం ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవలే ఏపీ ఎన్నికలపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని సర్వేలు చెబుతున్నాయి. అయితే, రెండు పార్టీలు విడిగా పోటీచేస్తే అధికారంలోకి వచ్చేంత మెజారిటీ రాదని సర్వేలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాష్ట్రంలో ఎక్కువమంది పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబును, జగన్ ఇద్దరికి అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు కూడా ఓ అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.