Nara Lokesh: నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు
Nara Lokesh: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే.. మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ తెలుగుదేశం పోటీగా పోరాటాలు చేస్తోంది. చంద్రబాబు ఇప్పటికే చాలా నియోజకవర్గాలను చుట్టేసారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు.
నారా లోకేశ్ నిర్వహించనున్న ‘యువగళం’ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర మొదటి మూడు రోజులు టీడీపీ అధినేత మాజీ సీఎం లోకేష్ తండ్రి అయిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సాగనుంది. కుప్పం నియోజక వర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి దేవాలయం నుంచి లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
పాదయాత్రతో లోకేశ్ ఏడాదిపాటు ప్రజల మధ్యే ఉండేలా రూట్ మ్యాప్ సిద్దమైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ పాదయాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. తొలిరోజు యాత్రలో కొందరు బీసీ యువ నేతలు ఆయనతోపాటు పాల్గొంటున్నారు. వీరిలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చీపురుపల్లి ఇన్‌చార్జి కిమిడి నాగార్జున, యువత నేతలు రాయపల్లి వెంకట్, గుత్తికొండ ధనుంజయ్ తదితరులు ఉండబోతున్నారు. మొత్తం 400 రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఆయన సుమారుగా 4,200 కిలోమీటర్ల దూరం నడవనున్నారు.