Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్!
Nara Lokesh Padayatra: అనేక వివాదాల నడుమ ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈ సాయంత్రం లోగా చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబోవద్దని షరతులు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 27న కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈనెల 26నే నారా లోకేష్ కుటుంబీకుల తో కలిసి తిరుపతికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నందమూరి, నారా కుటుంబాలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని కుప్పంకు పయనం అవుతారని చెబుతున్నారు. కుప్పంలో ఒక భారీ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మీడియాలో హైలైట్ అయ్యాక లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారని సమాచారం. 27న ఉదయం కుప్పంలో వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కమతమూరు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు పక్కన భారీ బహిరంగ సభకు వెళ్లనున్న నారా లోకేష్ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది.