Nara Lokesh Birthday: ‘హేళన చెక్కిన శిల్పం’.. కార్యకర్తలు ఆశిస్తుంది ఏంటి?
Nara Lokesh Birthday: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీలో నెంబర్ 2 గా అందరూ భావించే నారా లోకేష్ జన్మదినం నేడు. ఎన్టీఆర్ మనవడిగా.. చంద్రబాబు నాయుడు కుమారుడుగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి లోకేష్ గురించి టీడీపీ శ్రేణులకు కొద్దో గొప్పో తెలుసు కానీ ఆయన తమ నేతగా ఎంట్రీ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో చదువుకున్న లోకేష్, చదువుపూర్తి కాగానే ముందుగా ప్రపంచ బ్యాంక్ లో ఉద్యోగం చేసిన ఆయన ఆ తరువాత ఇండియా వచ్చి హెరిటేజ్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2013లో పార్టీలో చేరినప్పటికీ అంతకు ముందే 2009 ఎన్నికల్లో టీడీపీ హామీల్లో ఒకటైన నగదు బదిలీ పథకాన్ని డెవలప్ చేశారని అంటూ ఉంటారు. అలా ఏదైతేనేమి రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందు లోకేశ్ గురించి ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చారు. తండ్రికి మించిన తనయుడు అని ప్రచారం చేశారు కానీ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనను పప్పుగా మార్చేశారు ప్రత్యర్థులు.
లోకేష్ తెలుగు సరిగా మాట్లాడలేకపోవడం ప్రత్యర్థి పార్టీకి వరంలా మారడమే కాక లోకేష్ కు శాపంలా మారింది. అయితే ఎమ్మెల్యే కాకుండా ఆయన్ని ఎమ్మెల్సీని చేసి లోకేష్ ను మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌తో తన పదవికి ఆయన న్యాయం చేసినా తెలంగాణలో కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌తో పోల్చి అన్ని విషయాల్లో ఆయనని ప్రతిపక్షం విమర్శించింది. ఓవైపు కేటీఆర్ మాటలు, చేతలతో దూసుకెళ్తుంటే.. లోకేశ్ ఆ స్థాయిలో వాక్చాతుర్యాన్ని కనబర్చలేకపోవడంతో దెబ్బ పడినట్టు అయింది. మంచి పనితీరు కనబర్చినా జనం ఎక్కువగా చూసేది తమ లీడర్ ఎలా మాట్లాడుతున్నాడో, ప్రత్యర్ధులకు ఎలా కౌంటర్ ఇస్తున్నాడు అనేది. ఈ విషయంలో లోకేష్ వెనుకబడ్డ క్రమంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడటంతోపాటు.. మంగళగిరిలో నారా లోకేష్ సైతం ఓడిపోవడంతో ఆయనను పూర్తిగా పప్పుగా మార్చేశారు.
అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా.. ఓటమి నేర్పిన పాఠంతో చినబాబులో మార్పు మొదలై క్రమంగా తనను తాను మెరుగుపర్చుకుంటూ అన్ని విషయాల్లో రాటు దేలాడు. ముఖ్యంగా జనంలోకి వెళ్తూ.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారు. చంద్రబాబు సంయమనంతో వ్యవహరిస్తే లోకేశ్ కాస్త దూకుడుగానే జగన్ సర్కారుపై విమర్శలు ఎక్కు బెడుతున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న లోకేష్ లాక్‌డౌన్ టైంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి బరువు తగ్గి పార్టీకి సంబంధించి తండ్రి బరువు బాధ్యతలను తగ్గించే దిశగా ముందుకు వెళ్లారు. రోజులు గడిచే కొద్దీ చంద్రబాబుపై వయోభారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో లోకేష్ నుంచి పార్టీ నాయకులు, చంద్రబాబు మరింత ఆశిస్తున్నా కేటీఆర్‌తో పోలిక విషయాన్ని పక్కనబెడితే.. సీఎం జగన్‌కు ధీటైన నాయకుడని నిరూపించుకోవాలంటే లోకేశ్ ఇంకా శ్రమించాల్సి ఉంది.
లోకేష్ తనను తాను మరింత మెరుగుపర్చుకొని.. చంద్రబాబుపై భారాన్ని పూర్తిగా తగ్గించగలిగితే.. తండ్రికి తగ్గ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవుతారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన మరికొద్ది రోజుల్లో పాదయాత్ర చేయబోతున్నారు, ఇది ఒక రకంగా లోకేష్ పొలిటికల్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి, లోకేష్ యువగళం యాత్రలో నాయకుడిగా ఎదుగుతాడని అందరూ భావిస్తున్న క్రమంలో అసలు తండ్రికి దగ్గ వారసుడిగా గుర్తింపు సాధ్యమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎందుకంటే అటు జగన్..ఇటు కేటీఆర్ తో పోలిక వేళ లోకేష్ అసలు వారితో పోల్చకుండా తన ఇమేజ్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అటు జగన్ కు ఇటు కేటీఆర్ కు దీటుగా లోకేష్ తన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని టీడీపీ శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ఈ పాదయాత్ర లోకేష్ ను రాజకీయ నేతగా తీర్చిదిద్దుతుందని అందరూ భావిస్తున్నారు. చూడాలి ఏమి జరగనుంది అనేది.