Nara Lokesh : ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు.. వడ్డీ లేని రుణాలు!
Nara Lokesh Comments: అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం ఎనుము వారి పల్లిలో మైనార్టీలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లింలకి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం, వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మైనార్టీలను మోసం చేశారని పేర్కొన్న ఆయన మైనార్టీలను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఆదుకున్నది టిడిపి మాత్రమే అని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నా కానీ ముస్లిం సమస్యలు వారికి పట్టవని అన్నారు.
వక్ఫ్ ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేస్తుంటే వైసిపి మైనార్టీ ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించడం లేదని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో మైనార్టీలపై 46 దాడులు, 10 హత్యలు జరిగాయని పేర్కొన్న ఆయన పుంగనూరులో 12 మంది మైనార్టీల పై అక్రమ కేసులు పెట్టి కొట్టి జైలుకు పంపారని పేర్కొన్నారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించిన ఆయన మస్జిద్ భూములు కోసం పోరాడిన ఇబ్రహీం ని నడి రోడ్డు మీద చంపేశారని అన్నారు.
హజీరను అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజు వరకు కనీసం ఆమె తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని పేర్కొన్న ఆయన చదువుల తల్లి మిస్బాని వైసీపీ నేత వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని అన్నారు. టీడీపీ రంజాన్ తోఫా ఇచ్చింది, దుల్హన్ పథకం, విదేశీ విద్య, మస్జిద్, ఈద్గా అభివృద్ధికి నిధులు ఇచ్చిందని అన్నారు. షాదీఖానాలు అభివృద్ధి చేసింది టీడీపీ, ఖబర్ స్థాన్ లు అభివృద్ధి చేసింది టీడీపీ, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీ అని నారా లోకేష్ అన్నారు ఉర్దూ లో ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటానికి బోర్డు కి జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామని అన్నారు.