Nandayal TDP: చంద్రబాబు సీటు ఫైనల్ చేసేశారా?
Nandayal TDP Seat: తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని కసిగా పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ తరువాత అనేక కారణాలతో 2019లో గెలవలేకపోయింది. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడ్డుకాలం ఎదుర్కొంటున్న టిడిపి ఈసారి గెలవకపోతే మరోసారి గెలిచే అవకాశం లేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఇదే తనకు చివరి ఎన్నికలు అని బతిమలాడే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా తన భిన్నమైన మెతక స్వభావాన్ని పక్కనపెట్టి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు. అయితే ఇప్పటివరకు దాదాపు 175 నియోజకవర్గాల్లో 156 నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ముందే ఖరారు చేస్తూ వస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో పని తీరు బాగోలేదని ఆయన భావిస్తున్న వారికి అలాగే తాను రాబిన్ టీంతో కలిసి సర్వే చేయించిన వారికి సీటు విషయం మీద గ్యారెంటీ ఇవ్వడం లేదు. పర్వాలేదు, కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రం ఈయనదే సీటు కచ్చితంగా గెలిపించుకుని రావాలి అంటూ కార్యకర్తల ముందే వారి భుజం తడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఉమ్మడి కారణాలు జిల్లా ఆళ్లగడ్డ సీటు గురించి ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే సీటు ఆశిస్తూ నంద్యాల సీటు కూడా తమ కుటుంబానికే కేటాయించాలని కోరుతున్నారు. తన తమ్ముడి జగత్ విఖ్యాత్ రెడ్డిని అక్కడ నిలబెట్టి గెలిపిస్తానని అఖిలప్రియ చెబుతున్నారు. కానీ అఖిలప్రియ సీటే ఇంకా ఖరారు కాని పరిస్థితి నెలకొంది.
ఆమె వ్యవహార శైలి పనితీరు బాగోలేదని భావిస్తున్న చంద్రబాబు ఆమెను పక్కన పెట్టేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అయితే తాజాగా నంద్యాల నియోజకవర్గం మీద చంద్రబాబు సమీక్ష నిర్వహించగా ప్రస్తుత ఇన్చార్జిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి తో పాటు నంద్యాలకు సంబంధించిన కొందరు కీలక నేతలు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు ప్రభుత్వ పనితీరు తెలుగుదేశానికి ఉన్న అవకాశాలు వంటి విషయాలను చంద్రబాబు దృష్టికి బ్రహ్మానందరెడ్డి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నింటినీ విన్న తర్వాత చంద్రబాబు నియోజకవర్గంలో ఇక మీదట ఏం చేయాలనే విషయం మీద సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సీటు వేరే వారికి ఇస్తున్నాం అనే విషయం ఎక్కడా చెప్పకుండానే చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళమని సూచనలు చేయడంతో ఈ సీటు దాదాపుగా భూమా బ్రహ్మానంద రెడ్డికి ఖరారు అయినట్లే అనే ప్రచారం జరుగుతోంది.
ఇక భూమా అఖిల ప్రియ తో పాటు ఆమె తమ్ముడు కూడా ఇటీవల పలు కిడ్నాపింగ్ వివాదాల్లో చిక్కుకోవడం ఆళ్లగడ్డలో పార్టీ బలోపేతానికి కృషి చేయకపోవడం, పర్సనల్ పనులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడంతో అఖిలప్రియను సైతం పక్కనపెట్టి ప్రస్తుతం బిజెపిలో ఉన్న భూమా కిషోర్ రెడ్డిని తెలుగుదేశంలోకి తీసుకుని ఆయనను బరిలోకి దింపాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబంలో భూమా బ్రహ్మానంద రెడ్డికి కూడా పెద్దగా వాయిస్ లేదు కానీ భూమా కిషోర్ రెడ్డి మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తిగా కనిపిస్తూ ఉండడంతో చంద్రబాబు ఆ మేరకు ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే బ్రహ్మానందరెడ్డి మాట్లాడలేకపోయినా సౌమ్యుడిగా అభివృద్ధి పధంలో నంద్యాలలోను నడిపించే వ్యక్తిగా అక్కడి ప్రజలు నమ్ముతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయనకు నంద్యాల సీటు కేటాయించి ఆళ్లగడ్డ నుంచి భూమ కిషోర్ రెడ్డిని రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.