Nagababu: పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. వ్యూహం ఉందంటూనే!
Janasena Alliance: కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్న జనసేన నేత నాగబాబు పొత్తుల అంశం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుంటే అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్న ఆయన పొత్తులు నిర్ణయించడానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడం వెనుక ఏదో వ్యూహం ఉందని ఆయన అన్నారు. వైసీపీ విమర్శ అనేది దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తెచ్చిందన్న నాగబాబు పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించొచ్చు కానీ వైసీపీ లా దిగజారి మేము మాట్లాడలేమని అన్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం ను చేయడమే లక్ష్యమన్న నాగబాబు లైమ్ లైట్ లోకి రావడానికి మమ్మల్ని విమర్శిస్తున్నారని, వారికి ఉపయోగపడుతుందంటే తిట్టనివ్వండి అని కామెంట్ చేశారు.
ఇక ప్రజలకు సేవ చేసే కృషిలో మేమున్నామని పేర్కొన్న నాగబాబు సింహం సింగిల్ వస్తుందనే సినిమా డైలాగులకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. జర్మనీని ఓడించడానికి అమెరికా, రష్యా వంటి దేశాలు కలిశాయని అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాల్సి వస్తుందని నాగబాబు పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అని పేర్కొన్న ఆయన తాను ఎన్నికల్లో పోటీ చేయను కానీ పార్టీని పటిష్టం చేయడానికి పని చేస్తానని పేర్కొన్నారు. 2019 లో 7 శాతం ఓట్లు వచ్చిన జనసేన ఇపుడు 24.5 శాతానికి పెరిగింది….రాబోయే రోజుల్లో 40 శాతం వరకు పెరగొచ్చని అన్నారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేనపై జనంలో అభిమానం, నమ్మకం ఉండదన్నది నిజం కాదని నాగబాబు పేర్కొన్నారు. సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా గతంలో ఓడిపోయాయి అని నాగబాబు పేర్కొన్నారు.