Magunta Srinivasula Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు మాగుంట గైర్హాజరు
Magunta Srinivasula Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇతర నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై సహా సౌత్ గ్రూప్ మెంబర్స్ గా పేర్కొనే పలువురితో కలిపి ఒకేసారి విచారించాలని ఈడీ యోచిస్తోంది. ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 18న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు దూరంగా ఉన్నారు.
తన సోదరుని కుమారుడు అనారోగ్యం కారణంగా తాను చెన్నైలో ఉండిపోయానని, కాబట్టి విచారణకు రాలేకపోతున్నానని ఈడీకి ఆయన లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ తరుణంలో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈడీ అధికారులు. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది.