MP Avinash Reddy: నేడు మరోసారి సీబీఐ ముందుకు అవినాశ్ రెడ్డి
MP Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడుసార్లు విచారణ నిర్వహించారు. కాగా, ఈ కేసులో ఆయన్ను నాలుగోసారి అధికారులు విచారణ చేయనున్నారు. గతంలో జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10వ తేదీన అధికారులు ఆయన్ను విచారించారు. కాగా, నేడు మరోమారు ఆయన్ను సీబీఐ విచారించనున్నది. తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇక ఇదిలా ఉంటే, తన అరెస్ట్ పై స్టే కోరిన అవినాష్‌కు కొంత ఊరట లభించింది. రిట్ పిటిషన్‌లో తుది తీర్పు వచ్చే వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, నేడు నాలుగోసారి సీబీఐ విచారణ చేయనున్న నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారనే ఉత్కంఠత నెలకొన్నది. అరెస్ట్ చేయాలంటే కోర్టు తీర్పు రావాలి. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా సీబీఐ నిరీక్షిస్తుందా? రిజర్వ్ చేసిన తీర్పును వెంటనే ప్రకటించాలని కోరే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీబీఐ కొంతమందిని అదుపులోకి తీసుకున్నది. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించింది. అటు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే స్పష్టం చేసింది.