Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో నాకు సీటు డౌటే.. బాలినేని శ్రీనివాసరెడ్డి
Balineni Srinivasa Reddy: రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బాలినేని ఈ వ్యాఖ్యలు చేసాడు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని సీఎం జగన్ చెబుతున్నారని రానున్నఅసంబ్లీ ఎన్నికల్లో తనకు కు కాకుండా తన సతీమణి కి టికెట్ ఇస్తారేమో అన్నారు. నీకు సీటు లేదు..నీ భార్యకిస్తామని సీఎం జగన్ అంటే తాను కూడా చేసేది ఏమీ ఉండదని అన్నారు.
నియోజకవర్గస్థాయి నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని బాలినేని సూచించారు. వైసీపీ కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయని పార్టీ గెలుపు కోసం అందరితో నడవాల్సిందేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ఓటమిపాలైంది. పార్టీ నేతలు విభేదాలు పక్కనబెట్టి అందరిని కలుపుకుపోవాలని అన్నారు.