అమాత్యుల అలకపాన్పు.. అసమర్థ ముద్ర మాకెందుకు?
అధికార వైసీపీలో మంత్రివర్గ మార్పు ఇప్పుడు తలనొప్పిగా మారింది. నిజానికి ‘సగం పదవీకాలం పూర్తికాగానే మంత్రులను మారుస్తాం అని జగన్ గద్దెనెక్కుతున్న సమయంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని ఉంచి 90 శాతం మందిని మారుస్తునారని అంటున్నారు. ఈ విషయం మీదే కొంతమంది సీనియర్ మంత్రులు అలకపాన్పు ఎక్కారని అంటున్నారు. తీసేస్తే అందరినీ తీసేయండి. ఉంచితే అందరినీ ఉంచండి. ఇద్దరు ముగ్గురు మంత్రులను మాత్రం కొనసాగించి… మిగిలిన వాళ్లను తొలగిస్తామని అంటే వారిపై అసమర్థులనే ముద్ర పడుతుందని అందుకే దానికి ఒప్పుకునేది లేదు’’ అని తేల్చి చెబుతున్నట్లు ప్రచారం. జిల్లాలో కొందరిని కొనసాగించి… ఇంకొందరిని తొలగించడం వల్ల తమకు రాజకీయంగా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నట్లు సమాచారం. మంత్రివర్గం ప్రక్షాళన అంశంపై ఇప్పటికే చాలామంది మండిపడుతున్నారని… మున్ముందు పార్టీ అధ్యక్షుడితో అమీతుమీ తేల్చుకునేందుకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విశాఖ శారదా పీఠం ఖరారు చేసిన ముహూర్తం మేరకు ఏప్రిల్ 9 లేదా 11వ తేదీన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేసేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 8వ తేదీన గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలుస్తారని .. 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. చూడాలి ఈసారి ఏమేం జరగబోతోంది అనేది.