Roja counter to PK: ఎవరి సైన్యంలో దూరి యుద్ధం చేయాలో పవన్‌కు అర్ధం కావడం లేదు
Minister Roja counter to Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తనకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తన ప్రచార వాహనం గురించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వాహనం కలర్‌పై వైసీపీ నేతలు కొన్ని ప్రశ్నలు సంధిస్తే పవన్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ట్విట్టర్ ద్వారా పవన్ గుర్తుచేశారు. వైజాగ్‌లోను, అమరావతిలో తన అడ్డుకున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను శ్వాస తీసుకోవడం కూడా ఆపేయాలా అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఓ ఫోటో ట్వీట్ చేశారు. ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని కత్తులతో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న ట్వీట్లు, వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి అని రోజా అన్నారు. కత్తులు పట్టుకున్న పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరో సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నారని రోజా ప్రశ్నించారు.
175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని పార్టీ జనసేన పార్టీ అని ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన పని లేదని రోజా అన్నారు. మీడియా అనవసరంగా పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యత ఇస్తోందని రోజా అన్నారు.
హైదరాబాద్‌లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వద్దా అనేది చెప్పాల్సింది కేసీఅర్, కేటీఆర్ అని కౌంటర్ ఇచ్చారు. దత్తపుత్రుడు చంద్రబాబు కోసం పని చేస్తున్నాడని మరోసారి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 స్థానాలు గెలిచి పవన్, చంద్రబాబులను హైదరాబాద్‌కు పంపడం ఖాయమని రోజా జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలపైనా, పార్టీ పైనా ప్రేమ లేదని విమర్శించారు.