Jogi Ramesh: అది వారాహి కాదు నారాహి, జనసేన వాహనంపై మంత్రి సెటైర్లు
Minister Jogi Ramesh comments on Pawan Kalyan Vehicle Varahi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ భారీ వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. ఈ వాహనంపై వైసీపీ నేతలు అనేక విమర్శలు గుప్పించారు. తాజాగా మంత్రి జోగి రమేశ్ ఈ వాహనం పేరుపై స్పందించారు. పవన్ కళ్యాణ్ వాహనం పేరు వారాహి కాదు నారాహి అని పెడితే సరిగ్గా సరిపోతుందని మంత్రి జోగి రమేశ్ అన్నారు.
చంద్రబాబు దమ్మున్న మగాడు అయితే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే నిలబడతారని చెప్పమనండని జోగి రమేశ్ సవాలు విసిరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉంటారని, తానే సీఎం అభ్యర్థినని చెప్పగలడా? అని జోగి రమేశ్ ప్రశ్నించారు. వీళ్ళంతా పగటి వేషగాళ్ళు, సిగ్గులేని వాళ్ళని జోగి రమేశ్ విమర్శించారు.
చరిత్రలో ధీరుడుగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే… చంద్రబాబు చరిత్ర హీనుడని జోగి రమేశ్ అన్నారు. పిరికి సన్నాసి పవన్ కళ్యాణ్ గురించి మేం మాట్లాడాలా అంటూ ఎద్దేవా చేశారు.
తాను అధికారంలోకి వస్తే వైసీపీ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగిస్తానని చంద్రబాబు అనడంపై కూడా జోగి రమేశ్ స్పందించారు. చంద్రబాబు అలా అన్నాడంటే..వైసీపీ పథకాలను ప్రశంసిస్తున్నట్లే కదా అని అన్నారు.