తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
Minister Amarnath: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలిపారు. ఆ భూములపై బహిరంగ చర్చకు సిద్దమన్నారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి అమర్నాథ్ పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు నిరూపించకపోతే ఆయన లోకేశ్ రాజకీయాలు నుండి తప్పుకుంటారా అంటూ సవాల్ విసిరారు.
అనకాపల్లి సభలో అమరావతే రాజధాని అని బలవంతంగా చెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు విశాఖపై ఎంత ద్వేషం ఉందో అనకాపల్లి సభతో అర్థం అవుతుందన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మీ కొడుకులాగా సందులో నుంచి రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబుపై అమర్నాథ్ చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు, తోడల్లుడు గీతం వర్సిటీ పేరుతో భూములు కబ్జా చేశారని ఆరోపించారు. విస్సన్నపేటలో 609 ఎకరాలు కబ్జా చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారని, కానీ అందులో 49 ఎకరాలు రంగుబోలిగడ్డ రిజర్వాయర్ కోసం సేకరించిన చంద్రబాబు, రైతులకు పరిహారం కూడా ఎగ్గొట్టారన్నారు.
విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక్క పేదవాడికైనా ఒక సెంటు భూమి పంచి పెట్టారా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల మందికి భూమి పంపిణీ చేసిందని, అంతే కాకుండా ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చు కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలను సమాధులుగా మాట్లాడుతున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారన్నారు.