Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..
Mekapati Comments:వైసీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది. సీనియర్ నేతలు అధినాయకత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. సీనియర్ నేతలు ఆనం, కోటంరెడ్డి తరువాత ఇప్పుడు మరోనేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ అన్ని సీట్లు గెలిచింది. తిరిగి ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత మరొకరు చేస్తున్న వ్యాఖ్యలతో నెల్లూరు వైసీపీ లో ఏం జరుగుతోందంటూ పార్టీలో కలకలం మొదలైంది.తాజాగా ఉదయగిరి ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పార్టీ పరిశీలకుడు కొడవలూరు ధనంజయ రెడ్డి వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని, ఆయన సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.
ఇది అందరికీ తెలిసిందేనంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లానని అయినా నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారని అన్నారు. నేతలను సమన్వయ పర్చకుండా నా వ్యతిరేకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని, కొందరిని రెచ్చగొడుతున్నారని అన్నారు. నియోజకవర్గాల్లో మాకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి గత ఏడాది ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడుగా కొడవలూరు ధనంజయ రెడ్డిని నియమించింది వైసీపీ. రాబోయే 2024 ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి గెలుపునకు తాను శాయశక్తుల కృషి చేస్తానని మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నా ఆయనకు టికెట్ ఇస్తారేమో అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మేకపాటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.