Twist: ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత.. నెల్లూరులో ప్రత్యక్షం
RK Beach to Nellore: గత 2 రోజుల క్రితం విశాఖ ఆర్కే బీజ్‌లో సాయిప్రియ అనే వివాహిత అదృశ్యమైన ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది. పెళ్లి రోజు కావడంతో సాయిప్రియ, శ్రీనివాసరావు దంపతులు రెండు రోజుల క్రితం సరదాగా బీచ్‌కు వెళ్లారు. కొద్ది సేపు బీచ్‌లో గడిపారు. ఒకరికి ఒకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారు. అదే సమయంలో శ్రీనివాసరావుకు ఫోన్ రావడంతో అతను మాట్లాడుకుంటూ పక్కకు వెళ్లాడు. ఫోన్ మాట్లాడి వచ్చేసరికి సాయిప్రియ కన్పించలేదు. అతను ఎక్కడ చూసినా తన భార్య ఆచూకీ లభించకపోయే సరికి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సాయిప్రియ అలల తాకిడికి సముద్రంలో కొట్టుకు పోయిందా లేక ఎవరైనా ఏమైనా చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు ఆమె గల్లంతైనట్లు భావించిన పోలీసులు సముద్రంలో జల్లెడ పట్టారు. రెండు రోజులుగా స్పీడ్ బోట్లు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో గాలింపు చేపట్టారు. ఎంతకీ వివాహిత ఆచూకీ లభించకపోగా ఆమె భర్త శ్రీనివాసరావుపై అనుమానాలు పెరిగాయి.
ప్రస్తుతం సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమవ్వడం కొత్త ట్విస్ట్‌గా మారింది. భార్యభర్తల మధ్య కొన్ని వివాదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యువకుడితో నెల్లూరు వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విశాఖ పోలీసులు మరికొన్ని గంటల్లో వెళ్లడించనున్నారు.