School Opening: ఏపీలో ఆలస్యంగా తెరుచుకోనున్న పాఠశాలలు
ఏపీలో పాఠశాలల పునః ప్రారంభం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జులై 4న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జులై 4న కాకుండా జులై 5న విద్యా సంస్థలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వేసవికి ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక్క రోజు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకునేందుకు గల కారణాలను కూడా విద్యాశాఖ వెల్లడించింది. జులై 4న ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని రాకతో పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది.
మరోవైపు పాఠశాలలకు, ప్రధాని రాకకు ఎలాంటి సంబంధమని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం ప్రధానికి రక్షణగా ఉంచబోతుందా అని ప్రశ్నిస్తున్నారు. లేక ప్రధాని పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులను మంగళగిరికి తీసుకెళ్తున్నారా అని మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి తన కార్యక్రమాన్ని తాను చూసుకొని తిరిగి వెళ్తారని, ప్రధాని రాష్ట్రంలో ఉండే రెండు గంటలకు స్కూళ్ల ప్రారంభ తేదీని వాయిదా వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.