Kotamreddy: జిల్లాలోని పెద్ద కుటుంబాలు అనేక సార్లు నా గొంతు కోశారు!
Kotamreddy Sridhar Reddy Comments: నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని పేర్కొన్న ఆయన నా అనుకునే వాళ్లకోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధమని అన్నారు. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తనకు అనేక సార్లు రాజకీయంగా అవకాశాలు వచ్చాయని కానీ జిల్లాలోని పెద్ద కుటుంబాలు అనేక సార్లు నా గొంతు కోశారని అన్నారు. వీళ్ళే ఎంఎల్ఏలు, వీళ్ళ కొడుకులు, బావ మరుదులు, ఆఖరికి పుట్ట బోయే వీళ్ళ మనవళ్లే ఎంఎల్ఏలుగా ఉండాలనుకునే కుటుంబాలు నా ఎదుగుదలను అడ్డుకున్నాయని అన్నారు.
అయినా వెన్ను చూపకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగానని పేర్కొన్న ఆయన సీట్ల వద్దకు వచ్చే సరికి ఎంఎల్ఏ, ఎంపీ, మంత్రి పదవులు పెద్ద కుటుంబాలకేనని అన్నారు. పదవులు వారికి ఓట్లు మాత్రం మావా? అని పేర్కొన్నారు. ఇలా అలాంటివి ఇక సాగవని పేర్కొన్న ఆయన ఓట్లు మావే, సీట్లు మావే ఎంఎల్ఏ, ఎంపీలు మంత్రి పదవులు మావేనని అన్నారు. ప్రజా సమస్యల కోసం జైళ్ళకు పోయానని, పోరాటాలు చేసి ఎదిగానని అన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయనని పేర్కొన్న కోటంరెడ్డి పనుల కోసం వచ్చే వారి చేసే సాయంతో నమ్ముకున్న వారిని ఆదుకుంటున్నానని అన్నారు.