Kotamreddy Politics in Nellore: కోటంరెడ్డి దారెటు?
Kotamreddy Politics in Nellore: గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలను సైతం వైసీపీ గెలుచుకున్నది. మొదటి రెండేళ్లు వైసీపీకి తిరుగులేని విధంగా పార్టీని బలంగా నాటుకుపోయేలా నేతలు పావులు కదిపారు. అయితే, ప్రభుత్వం సంక్షేమం పేరుతోనే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తున్నది. నేతలను పట్టించుకోవడం లేదని కొందరి వాదన. అనుమానం వచ్చిన నేతలపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసిందని నేతలు ఆరోపించడం మొదలు పెట్టారు. వీరిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి కూడా ఉన్నారు.
తన ఫోనును వైసీపీ ట్యాపింగ్ చేసిందని బహిరంగంగా విమర్శించాడు. దీంతో వైసీపీకి, కోటంరెడ్డికి దూరం పెరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. సొంతపార్టీ వాళ్లపై కూడా సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోటంరెడ్డి సైతం సొంతపార్టీపై విమర్శలు చేయడంతో అధికార వైసీపీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లా బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. ఆయన మార్గదర్శకత్వంలోనే నెల్లూరు జిల్లా నేతలు నడుచుకోవాలని హుకుం జారీ చేసింది.
దీంతో కోటంరెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చి టీడీపీలో చేరాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు కూడా ప్రకటించాడు. అయితే, కోటంరెడ్డికి తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది. అప్పటి వరకు టీడీపీ అనుకూలంగా ఉన్నా, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆయన్ను వ్యతిరేకించడంతో కోటంరెడ్డి టీడీపీలో చేరకుండా ఉండిపోయాడు. నెల్లూరు జిల్లా సీనియర్ నేత చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించాడు.
కోటంరెడ్డి పార్టీలోకి వచ్చి టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన తరువాత తిరిగి వైసీపీలోకి వెళ్లడనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో పాటు, అటు బుచ్చయ్య చౌదరి కూడా ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేయడంతో కోటంరెడ్డి టీడీపీలో చేరిక అసాధ్యం అని తేలిపోయింది. అటు చంద్రబాబు కూడా ఒక్కరి కోసం నెల్లూరు జిల్లా నేతలను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అంతేకాదు, పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు తోడుగా నిలవాలని అనుకున్నారు. దీంతో బాబు కూడా కోటంరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికంగా మారింది.
జనసేన పార్టీలో చేరే అవకాశం లేకపోవచ్చు. కల్మషం లేనివారికి మాత్రమే పార్టీ స్వాగతం పలుకుతుందని జనసేనాని ఇప్పటికే స్పష్టం చేశారు. పేరున్న నేతల కంటే, యువకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. యువకులైతే పార్టీకోసం కష్టించి పనిచేస్తారని జనసేన ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉండటంతో కోటంరెడ్డి దారెటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్యే అనే ఒకేఒక పదవి తప్పించి పార్టీ పరంగా ఎలాంటి అధికారాలు లేకపోవడంతో కోటంరెడ్డి పరిస్థితి రెండింటి చెడ్డ రేవడిలా మారింది.